భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇల్లెందు మున్సిపల్ కమీషనర్ రవిబాబును కొందరు స్థానిక తెరాస నేతలు కొట్టినందుకు పట్టణంలో మున్సిపల్ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ విధులు బహిష్కరించి నిరసనలు తెలియజేస్తున్నారు. ఆ కారణంగా పట్టణంలో రోడ్లపై చెత్తకుప్పలు పేరుకుపోయాయి. కొన్ని ప్రాంతాలలో మంచి నీటి సరఫరా నిలిచిపోయింది. దళితుడైన మున్సిపల్ కమీషనర్ రవిబాబుని తెరాస నేతలు కొట్టినందుకు తెలంగాణ గిరిజన ఉద్యోగ సంఘం, తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్, ప్రజా సంఘాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి. ఆయనపై దాడి చేసిన తెరాస నేతలపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. వాటితో కలిసి రాష్ట్ర మునిసిపల్ ఉద్యోగ జేఏసీ మంగళవారం సోమాజీగూడలో ప్రెస్ క్లబ్ లో పత్రికాసమావేశం నిర్వహించి, తెరాస నేతల దౌర్జన్యాన్ని గట్టిగా ఖండించాయి.
మున్సిపల్ కమీషనర్ పై తెరాస నేతలు దాడి చేస్తే ఆ శాఖకు మంత్రిగా ఉన్న కేటిఆర్ ఇంతవరకు ఎందుకు స్పందించలేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. మంత్రి కేటిఆర్ స్వయంగా తన ఫ్లెక్సీ బ్యానర్స్ పెట్టవద్దని చెపుతున్నా తెరాస నేతలు ఆయన మాట వినకుండా బ్యానర్లు ఏర్పాటు చేస్తుంటే, మంత్రిగారి ఆదేశాలను పాటిస్తూ వాటిని తొలగించమన్నందుకు మున్సిపల్ కమీషనర్ రవిబాబును అభినందించకపోగా తెరాస నేతలు కొట్టడం ఏమిటని ప్రశ్నించారు. తన శాఖకు చెందిన అధికారిపై తెరాస నేతలు దాడి చేస్తే మంత్రి కేటిఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఆయనపై దాడి చేసిన తెరాస నేతలపై తక్షణం కటిన చర్యలు తీసుకోవాలని తమ్మినేని కోరారు.
నేరెళ్ళ ఘటనలో కూడా తెరాస సర్కార్ స్పందించడంలో చాలా ఆలస్యం చేయడం వలన ప్రభుత్వానికి తీవ్ర అప్రదిష్ట కలిగింది. దానికి దళితులపట్ల చులకనభావం ఉందనే ప్రతిపక్షాల వాదనలు ముందుగా ప్రజలకు చేరాయి. జరుగకూడని నష్టం జరిగిపోయిన తరువాత మంత్రి కేటిఆర్ వెళ్ళి నేరెళ్ళ భాదితులను పరామర్శించి వచ్చారు. ఇప్పుడు రవిబాబు విషయంలో కూడా ఇంతవరకు ఆయన స్పందించకపోవడంతో ప్రతిపక్షాలకు మళ్ళీ మరో అవకాశం కల్పించినట్లవుతోంది.
ప్రతిపక్షాల కంటే ముందుగా మున్సిపల్ ఉద్యోగులే ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధ్యులైన తెరాస నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వారికి ప్రతిపక్షాలు కూడా తోడయితే ప్రభుత్వానికి మళ్ళీ అప్రదిష్ట తప్పదు కనుక మున్సిపల్ శాఖా మంత్రి కేటిఆర్ తక్షణం స్పందించడం చాలా అవసరం.