రాజకీయ వాసనలు సోకనంతవరకు ఏ సినీహీరో అయినా రాజకీయాలు మన సబ్జెక్ట్ కాదని చెపుతుంటారు. కానీ రాజకీయాలలోకి రావాలని నిశ్చయించుకొన్న తరువాత భ్రష్టు పట్టిపోయిన ఈ రాజకీయాలను సమూలంగా ప్రక్షాళన చేయడానికే తాము వస్తున్నామని చెపుతారు. కమల్ హాసన్ కూడా అలాగే మాట్లాడి రాజకీయాలలోకి ఎంట్రీ ఇస్తున్నారు.
అయితే ఆ ప్రకటన చేసిన వారం రోజులలోనే ఆయన ప్రజలకి, రాజకీయ పార్టీలకీ..అందరికీ దశావతారం సినిమా చూపించేస్తున్నాడు. అప్పుడే రోజుకొక మాట మాట్లాడుతూ ఒక సాధారణ రాజకీయ నాయకుడిలాగే వ్యవహరిస్తున్నారు.
రజనీకాంత్ కు అభ్యంతరం లేకపోతే ఆయనతో కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని మొదట చెప్పారు. ఆ మరునాడే ఆధ్యాత్మిక భావాలున్న రజనీకాంత్ తనతో కంటే భాజపాతో సులువుగా భాజపాతో సులువుగా కలిసిపోగలరని, కనుక ఆయనకు భాజపాయే బాగా సూట్ అవుతుందని అన్నారు.
తన ఆలోచనలు వామపక్ష భావజాలానికి కాస్త దగ్గరగా ఉంటాయని కమల్ చెప్పారు. కాషాయం కంటే ఎర్రరంగే తనకు బాగా నచ్చుతుందని అన్నారు. తద్వారా భవిష్యత్ లో వాటితో కలిసి పనిచేస్తానని సంకేతం ఇచ్చారని చెప్పవచ్చు. మళ్ళీ ఆ మరునాడే ‘అంత మాత్రాన్న వామపక్షాలతో చేతులు కలుపుతున్నానని అర్ధం కాదు,’ అని అన్నారు.
తనకు భాజపాతో పొసగదని తేల్చి చెప్పిన కమల్ హాసన్ ఈరోజు అందుకు పూర్తి భిన్నంగా “భాజపాతో సహా దేశంలో ఏ రాజకీయ పార్టీ అంటరానిది కాదు. ఏ పార్టీతో చేతులు కలిపినా నా అంతిమ లక్ష్యం తమిళనాడును అభివృద్ధి చేయడమే,” అని అన్నారు. అంటే అవసరమైతే భాజపాతో చేతులు కలపడానికైనా తాను సిద్దం అని స్పష్టంగానే చెప్పారు.
ఇంకా రాజకీయాలలోకి ప్రవేశించక ముందే ఇన్ని రంగులు మారుస్తున్న కమల్ హాసన్, రాజకీయాలలోకి ప్రవేశిస్తే ఇంకెన్ని రంగులు మారుస్తారో?