తమిళనాడు అధికార అన్నాడిఎంకెలో పళనిస్వామి, దినకరన్ మద్య సాగుతున్న ఆధిపత్యపోరులో ఒక్కోరోజు ఒక్కోరిది పైచెయ్యి అవుతోంది తప్ప అంతిమ ఫలితం కనుచూపుమేర కనబడటం లేదు. పళనిస్వామి సర్కార్ కు శాసనసభలో తగినంతమంది ఎమ్మెల్యేలు లేకపోయినప్పటికీ బలపరీక్ష జరపాలని గవర్నర్ విద్యాసాగర్ రావు ఆదేశించకపోవడాన్ని ప్రతిపక్షాలు తప్పు పడుతున్నాయి.
దినకరన్ పక్షాన్న ఉన్న 19 మంది ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవడానికి ఎంతప్రయత్నించినా వీలుపడకపోవడంతో వారిపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. కానీ హైకోర్టు స్టే విధించడంతో ఏమి చేయాలో పాలుపోనీ పళనిస్వామి సర్కార్, దినకరన్ ను లొంగదీసేందుకు రిటైర్డ్ హైకోర్టు జడ్జి అర్ముగస్వామి నేతృత్వంలో జయలలిత మృతిపై దర్యాప్తుకు కమీషన్ వేసింది.
కానీ దానికీ దినకరన్ ధీటుగానే బదులిచ్చారు. అమ్మ అపోలో ఆసుపత్రి చికిత్స తీసుకొంటున్న సమయంలో తీసిన వీడియో ఫుటేజ్ తమ వద్ద భద్రంగా ఉందని, సిబిఐతో సహా ఎవరికీ కావాలంటే వారికి దానిని ఇవ్వడానికి సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. అమ్మ ఆసుపత్రిలో ఉన్న సమయంలో నైటీతో ఉన్న కారణంగానే ఆ వీడియోను ఇంతవరకు బహిర్గతం చేయలేదని దినకరన్ తెలిపారు. అపోలో ఆసుపత్రిలో అమ్మకు సరైన చికిత్సే అందించామని కానీ తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆమె మరణించారని, దానిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆ అంశంపై కూడా పళనిస్వామి ప్రభుత్వం చవుకబారు రాజకీయాలు చేస్తోందని, వారికి ప్రజలే వారికి తగిన విధంగా బుద్ధి చెపుతారని అన్నారు.
ఒకవేళ అర్ముగస్వామి అమ్మ మృతిపై అనుమానాలు లేవనెత్తుతూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినా, దినకరన్ వద్ద బలమైన వీడియో సాక్ష్యాధారాలు, అమ్మకు అందించిన చికిత్సకు సంబంధించి అపోలో ఆసుపత్రి ఇచ్చిన బలమైన నివేదిక ఉన్నందున పళనిస్వామి సర్కార్ మళ్ళీ మరోమార్గం వెతుక్కోక తప్పదు.