సింగరేణి ఎన్నికలా లేక సార్వత్రిక ఎన్నికలా?

September 26, 2017


img

సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలను తెరాస ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో సార్వత్రిక ఎన్నికలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో ప్రచారం, హామీలు, వరాలు, ఎత్తులు సర్వత్రా కనిపిస్తున్నాయి. వారి హడావుడి చూసి సింగరేణి కార్మికులు సైతం ఆశ్చర్యపోతున్నారు. 

అయితే ఈ కార్మిక సంఘం ఎన్నికలను తెరాస సర్కార్ సీరియస్ గా తీసుకోవడానికి ఒక బలమైన కారణం ఉంది. సింగరేణి ఏరియా దాదాపు 12 శాసనసభ నియోజకవర్గాలలో విస్తరించి ఉంది. కనుక సింగరేణి కార్మిక సంఘాలపై పట్టు సాధిస్తే వచ్చే ఎన్నికలలో ఆ 12 నియోజకవర్గాలలో సులువుగా గెలవవచ్చు. అయితే ఇదేమీ కొత్త విషయం కాదు.  గతంలో కాంగ్రెస్ పార్టీ ఏనాడూ ఈ కార్మిక సంఘాల ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలతో ముడిపెట్టలేదు గనుక ఈ స్థాయిలో ఎన్నికలు జరుగడం లేదు. 

వచ్చే ఎన్నికలలో రెండు స్థానాలు తప్ప మొత్తం అన్నీ తామే గెలుచుకొంటామని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్లు తెరాస నేతల హడావుడి చూస్తే అర్ధం అవుతుంది. సింగరేణి ఎన్నికలను కూడా సార్వత్రిక ఎన్నికలన్నట్లుగా ఒక్కో ప్రాంతానికి ఒక్కో నేతకు బాధ్యతలు అప్పగించారు. మ‌ణుగూరు, ఇల్లెందు, కొత్త‌గూడెం ప్రాంతాలలో మంత్రి తుమ్మల, ఎంపీ పొంగులేటి, ఎమ్మెల్యే జ‌ల‌గం చూసుకొంటున్నారు. మరోపక్క తెరాస ఎంపిలు బాల్క సుమన్, కవితలు కూడా సింగరేణి ప్రాంతాలన్నీ కలియతిరుగుతూ తెలంగాణా బొగ్గుగని కార్మిక సంఘం తరపున ప్రచారం చేస్తున్నారు. 

రాజకీయ ఎన్నికలలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తే, సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలలో ఇతర సంఘాల నేతలను ఫిరాయింపజేస్తున్నారు. ఇక ఉద్యోగాల భర్తీ, జీతాల పెంపు, బోనస్, కార్మికుల ఇళ్ళలో ఏసీల ఏర్పాటు, ఇంకా పెండింగులో ఉన్న ఇతర సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెరాస నేతలు హామీలు గుప్పిస్తున్నారు. తెరాస నేతల హడావుడి చూసి ఇవి సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలా లేక సార్వత్రిక ఎన్నికలా? అని కార్మికులు సైతం ఆశ్చర్యపోతున్నారు. అయితే చిన్నపామునైన పెద్ద కర్రతోనే కొట్టాలన్నట్లు తెరాస ముందుకు సాగిపోతోంది. 


Related Post