అమెరికా యుద్ధ ప్రకటన..స్వాగతించిన ఉత్తర కొరియా!

September 26, 2017


img

అమెరికా, ఉత్తర కొరియా దేశాల మద్య యుద్ధం అనివార్యంగా కనబడుతోంది. ఇరుగుపొరుగు దేశాలపై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న ఉత్తర కొరియాకు గట్టిగా బుద్ధి చెప్పేందుకు అమెరికా సిద్దంగా ఉందని కనుక తమకు మద్దతు ఇవ్వాలని కోరుతూ ట్రంప్ యూరోపియన్ దేశాధినేతలకు, ఐక్యరాజ్యసమితికి లేఖలు వ్రాసినట్లు సమాచారం. అయితే అమెరికా ఏ దేశంపైనైనా యుద్ధం మొదలుపెట్టదలిస్తే దానికి ఎవరి అనుమతీ తీసుకోదని అందరికీ తెలుసు. అదే నిరూపిస్తున్నట్లుగా అమెరికా యుద్ధవిమానాలు శనివారం రాత్రి ఉత్తర కొరియా సరిహద్దులలో చాలాసేపు చక్కర్లు కొట్టి యుద్ధోన్మాదంతో రగిలిపోతున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిం జాంగ్ ఉన్ ను ఇంకా కవ్వించాయి. 

ఊహించినట్లుగానే ఉత్తర కొరియా వెంటనే స్పందించింది. ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి రి యంగ్‌ నిన్న మీడియాతో మాట్లాడుతూ, “అమెరికా యుద్ధప్రకటన చేసి మా దేశం మీదకు దాని యుద్ధవిమానాలను పంపింది కనుక మేము యుద్ధం మొదలైనట్లుగానే భావిస్తున్నాము. ఇటువంటి సందర్భాలలో ఆత్మరక్షణ చేసుకోక తప్పదు కనుక ఈసారి అమెరికా యుద్దవిమానాలు మా సరిహద్దులలో కనిపిస్తే వాటిని కూల్చివేస్తాము,” అని చెప్పారు. 

కిం జాంగ్ ఉన్ ఇంతవరకు అమెరికాపై అణుబాంబులు వేసి నాశనం చేసినట్లు, అమెరికా యుద్ధ విమానాలు, యుద్ద నౌకలను క్షిపణులతో ద్వంసం చేసినట్లు వీడియో గేమ్స్ ఆడుకొంటూ సర్దుకుపోతున్నారు. కానీ అవి అతని మనసులో యుద్దకాంక్షకు అద్దం పడుతున్నాయి. ఆయన ఏమి చేయదలచుకొన్నాడో వాటితో చూపిస్తున్నాడు. కనుక ఉత్తర కొరియా హెచ్చరికలను తేలికగా తీసుకోవడానికి లేదు.    

అయితే ఉత్తర కొరియా రెండుసార్లు జపాన్ దేశం మీదుగా క్షిపణులను ప్రయోగించింది. దానిని అది తప్పుగా భావించలేదు. పైగా జపాన్ కు తమ పొరుగుదేశంగా ఉండే అర్హత లేదు కనుక దానిని సముద్రంలో కలిపేస్తామని కిం జాంగ్ ఉన్ చాలా అనుచితంగా మాట్లాడారు. కానీ ఇప్పుడు అమెరికా యుద్ధవిమానాలు తమ సరిహద్దులవైపు వస్తే ఆత్మరక్షణ కోసం వాటిని కూల్చివేస్తామని చెప్పడం చూస్తే, ఉత్తర కొరియా తనకొక నియమం, ఇతరులకు మరొక నియమం అన్నట్లు వ్యవహరిస్తోందని స్పష్టం అవుతోంది. 

ఏమైనప్పటికీ డోనాల్డ్ ట్రంప్, కిం జాంగ్ ఉన్ ఇద్దరికీ వేపకాయంత వెర్రి ఉందని చెప్పక తప్పదు. వారిద్దరు తమతమ దేశప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. వారి చేతిలో యావత్ ప్రపంచాన్ని సర్వనాశనం చేయగల భయానకమైన మారణాయుధాలున్నాయి. కనుక  ఎవరు పొరపాటున అడుగు ముందుకు వేసినా ప్రపంచ చరిత్రలో ఈ 2017 సంవత్సరం అత్యంత భయానకమైన, విషాదకరమైన సంవత్సరంగా మిగిలిపోతుంది. వాటి మద్య యుద్దం జరిగితే ఆ ప్రభావం కేవలం ఆ రెండు దేశాలపైనే కాక యావత్ ప్రపంచ దేశాలపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తీవ్ర ప్రభావం చూపడం తధ్యం. 


Related Post