బాబుకి జేసి దివాకర్ జలక్?

September 21, 2017


img

తెదేపా ఎంపి జేసి దివాకర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు. గురువారం అనంతపురంలో తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, “ఒక ఎంపిగా ఈ మూడున్నరేళ్ళ నా నియోజక వర్గానికి మేలు కలిగే ఒక్క పని కూడా చేయలేకపోయాను. 2014 ఎన్నికల సమయంలో నన్ను గెలిపిస్తే తాడిపత్రికి నీటిని రప్పించి ప్రజల నీటి సమస్యలు తీర్చుతానని హామీ ఇచ్చాను కానీ దానినీ నెరవేర్చలేకపోయాను. ఇక ముందు కూడా నెరవేర్చే అవకాశం లేదని గ్రహించాను. అనంతపురం జిల్లా అభివృద్ధి కోసం నేను శాయశక్తులా కృషి చేశాను కానీ కొన్ని బలమైన శక్తులు నాకు అడ్డుపడుతున్నాయి. అందుకే ప్రజలకు ఏమీ చేయలేనప్పుడు ఇక ఎంపి పదవిలో ఉండి ఏమి ప్రయోజనమనే నిర్వేదంతోనే నా పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకొన్నాను. వచ్చే సోమవారం డిల్లీ వెళ్ళి స్పీకర్ కు నా రాజీనామా పత్రం సమర్పించి వస్తాను,” అని చెప్పారు.

2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోబోతోందని గ్రహించి తెదేపాలో దూకిన అనేక కాంగ్రెస్ నేతలో జేసి దివాకర్ రెడ్డి కూడా ఒకరు. అయితే ఆయనకు నోటి దురద చాలా ఎక్కువ. ఆ కారణంగా పార్టీకి, ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇబ్బంది కలిగించే మాటలు చాలా అన్నారు.

వచ్చే డిశంబరులో పోలవరం పూర్తి చేస్తానని చంద్రబాబు ఒక బహిరంగ సభలో చెపితే పక్కనే కూర్చొన్న జేసి దివాకర్ రెడ్డి లేచి ‘మరో ఐదేళ్ళలోనైనా చేయలేరు..చేస్తే గొప్పే..”అనీ టకీమని చెప్పారు. ఇటువంటి మాటలు చాలానే అన్నారు.

ఆయనకు ఒక్కసారైనా మంత్రిగా చేయాలనే కోరిక ఉంది. కానీ బాబు ఆయనను పట్టించుకోకుండా జిల్లాకే చెందిన ఆయన ప్రత్యర్ధి పరిటాల సునీతకు మంత్రి పదవి ఇచ్చారు. ఇక మరోవైపు జిల్లాలో హిందూపురం నియోజకవర్గానికి ప్రాతినిద్యం వహిస్తున్న నందమూరి బాలకృష్ణ హవా కూడా జోరుగా నడుస్తోంది. ఇదీ ఒక కారణం అయ్యుండవచ్చు.  

ఇక బయట నోటికి వచ్చినట్లు వాగుతారు కానీ లోక్ సభలో గట్టిగా మాట్లాడిన దాఖలాలు లేవు. ‘ఒకవేళ మాట్లాడినా మోడీ పట్టించుకోరు కనుక మాట్లాడటం వేస్ట్’ అని ఆయనే చెప్పుకొన్నారు.

తెదేపాలో ట్రావెల్ బిజినెస్ లో ఉన్న జేసి దివాకర్ రెడ్డి, కేశినేని నానికి మద్య విభేదాలు ఉండటం సహజమే. ఇటువంటి అనేక కారణాల వలన జేసి దివాకర్ రెడ్డి తెదేపాలో ఇమడలేక, ఆశించిన గుర్తింపు లభించనందుకు అసంతృప్తితో రగిలిపోతున్నారు. అందుకే రాజీనామాకు సిద్దమైనట్లున్నారు. అయితే ఆయన పార్టీలో ఉన్నా పోయినా ఎవరూ పట్టించుకోకపోవచ్చు కనుక రాజీనామా చేయడం ఖాయం అనే భావించవచ్చు. ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కనుక సహజంగానే వారికి నిలయమైన వైకాపాలోకి వెళ్ళేందుకు సిద్దం అవుతున్నారేమో? 


Related Post