కమల్ కు శల్యసారధ్యం చేయడానికి క్రేజీవాల్ రెడీ?

September 21, 2017


img

ఒకప్పుడు ఎన్టీఆర్ తరువాత దేశంలో అంత తక్కువ సమయంలో అధికారంలోకి వచ్చిన ఏకైక వ్యక్తి ఆమాద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. అలాగే పార్టీ పెట్టిన ఏడాదిన్నరలోగానే దానిని నడిపించలేక నవ్వుల పాలైన చిరంజీవిలాగే, అరవింద్ కేజ్రీవాల్ కూడా తన తలతిక్క పనులతో నవ్వులపాలయ్యారు.  

గొప్ప ప్రజాధారణతో, అనితర సాధ్యమైన బారీ మెజార్టీతో డిల్లీలో అధికారంలోకి వచ్చినప్పటికీ, ఆ ఖ్యాతిని నిలబెట్టుకొనేవిధంగా గొప్పగా పరిపాలన సాగించ మరింత పేరుప్రతిష్టలు సంపాదించుకొనే ప్రయత్నాలు చేయకుండా, వాపును చూసి బలుపు అనుకొని ఇరుగుపొరుగు రాష్ట్రాలకు తన పార్టీని విస్తరించాలనుకొన్నారు. పంజాబ్ లో అధికారంలో రావాలనే ప్రయత్నాలలో ఉండగా డిల్లీలో ఆమాద్మీ పార్టీ, ప్రభుత్వం రెండూ కుప్పకూలే పరిస్థితి వచ్చింది. అప్పుడు గానీ ఆయన మేల్కొనలేకపోయారు. 

స్వంత ఇంటినే చక్కబెట్టుకోలేకపోతున్న అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు తమిళనాడు రాజకీయాలలో వేలు పెట్టడానికి బయలుదేరడం విశేషం. కోలీవుడ్ సూపర్ స్టార్ కమల్ హాసన్ త్వరలో రాజకీయ పార్టీ స్థాపించబోతున్నట్లు ప్రకటించడంతో అరవింద్ కేజ్రీవాల్ చెన్నైలో వాలిపోయి గురువారం మధ్యాహ్నం కమల్ హాసన్ తో భేటీ కాబోతున్నారు. 

కమల్ హాసన్ కూడా భాజపాను వ్యతిరేకిస్తానని చెప్పినందున అయనకు అవసరమైన సహాయసహకారాలు అందజేసి, పార్టీని స్థాపింపజేయడం ద్వారా తన బద్ధ శత్రువైన భాజపాను తమిళనాడులో అడుగుపెట్టకుండా అడ్డుకోవాలని అరవింద్ కేజ్రీవాల్ భావిస్తున్నట్లున్నారు. కమల్ తన పార్టీ స్థాపించిన తరువాత దానితో సహా భాజపాయేతర పార్టీలను అన్నిటినీ కూడగట్టుకొని భాజపాకు వ్యతిరేకంగా కూటమి తయారుచేయాలని అరవింద్ కేజ్రీవాల్ కలలు కంటున్నట్లున్నారు. అయితే ఉట్టికి ఎగురలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లు డిల్లీలో తన పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడుకోలేక సతమతమవుతున్న కేజ్రీవాల్ ఇప్పుడు కమల్ హాసన్ కు మార్గదర్శనం చేయడం అంటే శల్యసారధ్యం చేస్తున్నట్లే భావించవచ్చు. ఈ సంగతి కమల్ హాసన్ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది లేకుంటే జోగీ.. జోగీ   రాసుకొన్నట్లవవచ్చు. 


Related Post