మరి మజ్లీస్ నేతలు ఏమి చేస్తున్నట్లు?

September 21, 2017


img

హైదరాబాద్ నగర పోలీసులు నిన్న నగరంలోని ఒకేసారి అనేక లాడ్జీలపై ఆకస్మిక దాడులు చేసి 65 ఏళ్ళు వయసున్న అలీ మయాహీ హబీబ్‌ అలీ ఇస్సా అనే ఒక ఒమన్‌ దేశస్తుడిని, ఐదుగురు బ్రోకర్లను, ముగ్గురు ఖాజీలను, నలుగురు లాడ్జి యజమానులను అరెస్ట్ చేశారు. వీరందరూ కలిసి ఒమన్‌ నుంచి వచ్చిన అరబ్ షేక్ కు పాతబస్తీలో 10-20 ఏళ్ళు లోపున్న అనేక మంది అమ్మాయిలను చూపించి వారిలో అతను ఎంచుకొన్న 15 ఏళ్ళ అమ్మాయిని వివాహం చేశారు. నిరుపేదలైన ఆమె తల్లి తండ్రులకు డబ్బు ఎరగా వేసి రహస్యంగా ఈ పెళ్ళి జరిపించారు.   

హైదరాబాద్ పాతబస్తీలో అనేక ఏళ్ళుగా ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఐదు నెలల క్రితం ఫలక్‌నుమాకు చెందిన 15 ఏళ్ళ బాలికకు ఇదేవిధంగా వివాహం జరిపించి ఆమెను ఒమన్‌ పంపించినప్పుడు, అక్కడ ఆమె ఆ అరబ్ షేక్ చేతిలో చిత్రహింసలకు గురయ్యింది. ఆమెను అతికష్టం మీద పోలీసులు కాపాడి ఆమె తల్లి తండ్రులవద్దకు చేర్చగలిగారు. అప్పటి నుంచి ఇటువంటి వ్యవహారాలపై నిఘా ఉంచిన పోలీసులు, నిన్న ఆకస్మిక దాడులు చేసి ఈ ముసలి పెళ్ళి కొడుకును, అతనికి సహకరించిన వారినందరినీ అరెస్ట్ చేశారు. అయితే ఇకపై ఇటువంటి ఘటనలు పునరావృతంకావని అనుకోలేము. 

పాత బస్తీలోనే ఉండే మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ దేశంలో ముస్లింలందరికీ తానే ఏకైక ప్రతినిధినన్నట్లు, వారిని కాపాడే బాధ్యత తనదేనన్నట్లు ఎప్పుడూ మాట్లాడుతుంటారు. చివరికి మయన్మార్ కు చెందిన రోహ్యింగా శరణార్ధులను కాపాడే బాధ్యత కూడా భుజాన వేసుకొని వారికి భారత ప్రభుత్వం ఆశ్రయం కల్పించలేమని చెప్పినందుకు ప్రధాని నరేంద్ర మోడీపై నిప్పులు చెరిగారు. మోడీ సర్కార్ కు మానవత్వం లేదని విమర్శలు గుప్పించారు. 

కానీ తన కంటి ఎదురుగానే అభం శుభం తెలియని నిరుపేద ముస్లిం బాలికలను కాటికి కాళ్ళు చాపుకొనున్న అరబ్ షేక్ లు పెళ్ళిళ్ళు చేసుకొని వారి జీవితాలను చిద్రం చేస్తుంటే అసదుద్దీన్ ఓవైసీ ఆ సంగతి తనకు తెలియనట్లు వ్యవహరిస్తుంటారు. 

హైదరాబాద్ మరియు పాతబస్తీలో మజ్లీస్ పార్టీ విస్తరించి ఉంది. దాదాపు అన్ని ప్రాంతాలలో దానికి మంచి పట్టుంది కనుక మజ్లీస్ పార్టీ తలుచుకొంటే ఇటువంటివి అరికట్టడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. కానీ చూసీ చూడనట్లు ఊరుకొంటోంది కనుకనే ఇటువంటి అకృత్యాలు జరుగుతున్నాయి. తమ కంటి ముందు వృద్ద అరబ్ షేక్ కబంధ హస్తాలలో నలిగిపోతున్న ఆ అమాయక ముస్లిం బాలికలను రక్షించలేనప్పుడు ఇక దేశవిదేశాలలో ముస్లింల యోగక్షేమాల గురించి మాట్లాడటం ఓటు బ్యాంక్ రాజకీయాలు కాక మరేమిటి? 

హైదరాబాద్ నగరంలో ఐసిస్ ఉగ్రవాదులు, మాదక ద్రవ్యాల వ్యాపారులు, కల్తీ వ్యాపారులు, భూబకాసురులు, ఇటువంటి పెళ్ళిళ్ళు చేస్తున్న బ్రోకర్లపై పోలీసులు ఈవిధంగా నిరంతర నిఘా పెట్టి వారినందరినీ నిర్దాక్షిణ్యంగా ఉక్కుపాదం అణచివేయడం చాలా అవసరం. లేకుంటే చారిత్రిక నగరంగా పేరు పొంది ఇప్పుడు విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ కు తీరని కళంకం ఏర్పడుతుంది. అంతే కాదు ఇవి అనేక సామాజిక సమస్యలకు దారి తీస్తాయి కూడా. 


Related Post