మంత్రిగారు బాధపడితే ఏమి ప్రయోజనం?

September 20, 2017


img

రాష్ట్ర సాగునీటిశాఖ మంత్రి హరీష్ రావు వేములవాడలో మీడియాతో మాట్లాడుతూ, “ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజలను నిలువునా దోచుకొంటున్నాయి. గర్భవతులకు అవసరం ఉన్నా లేకున్నా స్కానింగులు తీస్తూ డబ్బులు పిండుకొంటున్నాయి. తేలికగా డబ్బు సంపాదించడం కోసం అవసరం లేకపోయినా సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యం చేయించుకొన్నాక వచ్చే బిల్లును చూసి సామాన్య ప్రజలు బేజార్ అవుతుంటారు. అందుకే పేద గర్భవతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఒడి, కేసీఆర్ కిట్స్ పధకాలను ప్రారంభించింది. ప్రభుత్వాసుపత్రులలో ప్రసవించిన మహిళలకు, కొత్తగా పుట్టిన శిశువులకు అవసరమైన వైద్యం, మందులు, వస్తువులతో బాటు ఆర్ధిక సహాయం కూడా అందిస్తున్నాము,” అని అన్నారు.           

ప్రభుత్వం చేపట్టిన ఈ రెండు పధకాలు నిసందేహంగా చాలా మంచి పదకాలే. వాటివలన పేద గర్భవతులకు ఎంతో ఉపశమనం లభిస్తోంది. అయితే నేటికీ మధ్యతరగతి..ఆ పైస్థాయిలో ఉన్నవారు ప్రభుత్వాసుపత్రులకు వెళ్ళేందుకు ఇష్టపడరు. కారణాలు అందరికీ తెలిసినవే. ఇదే అదునుగా తమ వద్దకు వచ్చిన వారిని ప్రైవేట్ ఆసుపత్రులు నిలువునా దోచుకొంటున్నాయి. ఈ సంగతి ప్రభుత్వానికి కూడా తెలుసునని హరీష్ రావు మాటల ద్వారా స్పష్టం అవుతోంది. మరి అటువంటప్పుడు ప్రభుత్వాసుపత్రుల తీరుతెన్నులను, దానిలో పనిచేసే సిబ్బంది వ్యవహార శైలిని మార్చేందుకు ప్రభుత్వం గట్టిగా కృషి చేయాలి కదా. 

అదే సమయంలో ప్రైవేట్ ఆసుపత్రులలో అక్రమాలు, దోపిడీ జరుగుతోందని తెలిసి ఉన్నప్పుడు కటిన చర్యలు తీసుకోవడం ద్వారా వాటిని కట్టడి చేస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుంది కానీ చేతిలో పదవీ, అధికారం అన్నీ ఉన్న మంత్రులు ఈవిధంగా అవేదన వ్యక్తం చేయడం వలన ఆ దోపిడీ ఆగదని గ్రహించాలి. 

కొన్ని దేశాలలో ప్రజలు ప్రభుత్వాసుపత్రులకు వెళ్ళి వైద్యం చేయించుకోవడానికే ఎక్కువ మొగ్గుచూపుతారు కానీ మనదేశంలో ప్రభుత్వాసుపత్రులు అంటేనే ప్రజలు హడలిపోతుంటారని మంత్రిగారే స్వయంగా చెప్పుతున్నారు. 

మంత్రులు కేటిఆర్, హరీష్ రావు వంటివారు పట్టుదలగా రేయింబవళ్ళు పనిచేస్తూ తమ శాఖలలో కళ్ళకు కనబడేంత స్పష్టమైన మార్పును సాధించగలుగుతున్నప్పుడు ఇతర శాఖలలో ఏ మార్పు రావడం లేదంటే అర్ధం ఏమిటి? స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా ప్రభుత్వసుపత్రులు, పాఠశాలలు, కళాశాలల తీరు మారదా? మారకపోతే దానికి బాధ్యులు ఎవరు? పాలకులా? అధికారులా? 


Related Post