వారసత్వ ఉద్యోగాల గురించి ఇప్పుడా మాట్లాడేది?

September 20, 2017


img

అక్టోబర్ 5న సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలు జరుగబోతున్నాయి. వాటిలో పోటీ ప్రధానంగా తెరాసకు అనుబందంగా ఉన్న సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘానికి, ప్రతిపక్షాలు బలపరుస్తున్న ఏ.ఐ.టి.యు.సి.కి మద్య జరుగబోతోంది. తమ పార్టీ అనుబంధ సంఘాన్ని గెలిపించుకోవడానికి తెరాస నిజామాబాద్ ఎంపి కవిత రంగంలో దిగారు. 

ఆమె ప్రధానంగా వారసత్వ ఉద్యోగాల గురించి గట్టిగా మాట్లాడుతున్నారు. వారసత్వ ఉద్యోగాల హామీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కనుక ఏదో విధంగా ఆ హామీని నెరవేర్చుతుందని ఆమె మళ్ళీ హామీ ఇస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆ అంశం కోర్టు పరిధిలో ఉంది కనుక దాని గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేనని కవిత అన్నారు. 

దీనికోసం ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేసినప్పుడు దానిపై తెరాస అనుబంద సంఘం సుప్రీంకోర్టులో అప్పీలు చేయగా దానిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. అది వేరే విషయం. ఆ తరువాత సింగరేణి కార్మికులు వారసత్వ ఉద్యోగాల గురించి ప్రభుత్వానికి ఎంత మోరపెట్టుకొన్నా ఎవరూ పట్టించుకోలేదు. తెరాస నేతలు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఎవరూ దానిపై కనీసం స్పందించలేదు. దాని గురించి ప్రతిపక్షాలు మాట్లాడినప్పుడు తెరాస నేతలు యధాప్రకారం వారిపై ఎదురుదాడి చేసి వారినోరు మూయించే ప్రయత్నం చేశారు తప్ప వారసత్వ ఉద్యోగాల గురించి మాట్లాడటానికి ఎవరూ ఇష్టపడలేదు. ఏమంటే ఈ కేసు కోర్టు పరిధిలో ఉందని తప్పించుకొనేవారు. ఈ సమస్య పరిష్కారానికి తమ ప్రభుత్వం ఏమి చేస్తోందో లేదా చేయదలచుకొందో కూడా చెప్పడానికి ఇష్టపడలేదు.   

అయితే ఇప్పుడు సింగరేణి ఎన్నికలు వచ్చాయి కనుక ఈ సమస్య గురించి కవిత గట్టిగా మాట్లాడుతున్నారు. ఇదివరకు అమలుచేయలేకపోయిన హామీని ఇప్పుడు తమ అనుబంద సంఘాన్ని గెలిపిస్తే అమలుచేయడానికి ప్రయత్నిస్తామని ఆ పాత హామీపై మరో కొత్త హామీ ఇస్తున్నారు. 

అసలు సింగరేణి కార్మికులకు తప్పకుండా వారసత్వ ఉద్యోగాలను కల్పించాలనే కోరిక, పట్టుదల తెరాస సర్కార్ కు ఉన్నట్లయితే దాని కోసం జీవో జారీ చేయకముందే దానిపై న్యాయవివాదాలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఉండాలి. కనీసం హైకోర్టు స్టే విధించిన తరువాతైనా ఈ సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి ముందుకు సాగాలి . కానీ ఆ రెండూ చేయకుండా మళ్ళీ హామీ ఇస్తోంది. ఒకవేళ ఇప్పుడు సింగరేణి ఎన్నికలు వచ్చి ఉండకపోతే వారసత్వ ఉద్యోగాల గురించి బహుశః కవిత కూడా మాట్లాడి ఉండేవారు కారేమో?


Related Post