పళనిస్వామికి ఎడాపెడా ఎదురుదెబ్బలే

September 20, 2017


img

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆయన నిన్న గవర్నర్ విద్యాసాగర్ రావును కలిసి తన ప్రభుత్వంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం గురించి మాట్లాడుదామనుకొంటే ఆయన అపాయింట్ మెంట్ ఇవ్వడానికి నిరాకరించారు. శశికళ వర్గానికి చెందిన 18 మంది అన్నాడిఎంకె ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి బలపరీక్షలో గట్టెక్కుదామనుకొంటే తదిపరి ఆదేశాలు జారీ చేసేవరకు బలపరీక్ష నిర్వహించడానికి వీలులేదని మద్రాస్ హైకోర్టు కొద్దిసేపటి క్రితం స్టే విధించింది. అలాగే 18 మంది అన్నాడిఎంకె ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై కూడా స్టే విధించింది.

కోర్టు నిర్ణయంతో పళనిస్వామి సర్కార్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు మారింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్, బలపరీక్ష కేసులను మళ్ళీ అక్టోబర్ 4న విచారిస్తామని కేసును అప్పటికి వాయిదా వేసింది. అయితే ఇది పళనిస్వామి వర్గానికి తిరుగుబాటు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కూడా మరో అవకాశం కల్పించినట్లయింది. తమిళనాడు రాజకీయాలలో ఏరోజు ఏమవుతుందో ఎవరూ ఊహించలేని విధంగా రోజుకొక కొత్త మలుపు తిరుగుతున్నాయి.  


Related Post