తమిళ పాలిటిక్స్ ఆల్వేస్ స్పైసీ!

September 19, 2017


img

తమిళనాడు అధికారపార్టీలో రాజకీయాలు తెలుగు సీరియల్ లాగ అంతుపొంతూ లేకుండా సాగిపోతూనే ఉన్నాయి. ఆ సీరియల్స్ లో లాగే తమిళ రాజకీయాలలో కూడా రోజూ ఏదో ఒక కొత్త ట్విస్ట్ వస్తుంటుంది కానీ దానితో ముగింపు రాదు...అవి కూడా సీరియల్ లాగే సాగిపోతుంటాయి. బహుశః ఈ పిచ్చి రాజకీయాలను చూసే కమల్ హాసన్ కు చిర్రెత్తి పార్టీ పెట్టేయడానికి సిద్దం అవుతున్నట్లున్నారు. 

తమిళనాడులో తాజా పరిణామాలు ఏమిటంటే: 

1. పళనిస్వామి వర్గం ఎంత ప్రయత్నించినా శశికళ మేనల్లుడు దినకరన్ వైపున్న 18 మంది అన్నాడిఎంకె ఎమ్మెల్యేలు లొంగకపోవడంతో వారిపై స్పీకర్ ధన్ పాల్ అనర్హత వేటు వేశారు. ఆమేరకు శాసనసభ్యుల సంఖ్య తగ్గుతుంది కనుక తమకున్న ఎమ్మెల్యేల బలంతో బలనిరూపణ పరీక్షలో సులువుగా గట్టెక్కవచ్చునని పళనిస్వామి భావిస్తున్నారు.

2. పళనిస్వామి, గవర్నర్ విద్యాసాగర్ రావు, స్పీకర్ ధన్ పాల్ ముగ్గురూ కలిసి రాజ్యాంగాన్ని తుంగలో త్రొక్కి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని దినకరన్, డిఎంకె నేత స్టాలిన్ ఆరోపిస్తున్నారు. పళనిస్వామి ప్రభుత్వానికి మెజార్టీ లేకపోయినా బలపరీక్షకు ఆదేశించకుండా గవర్నర్ విద్యాసాగర్ రావు రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. 

3. తమపై అనర్హత వేటు వేయడాన్ని సవాలు చేస్తూ 18 మంది అన్నాడిఎంకె ఎమ్మెల్యేలు ఈరోజు మద్రాస్ హైకోర్టులో సవాలు చేశారు.

గవర్నర్ విద్యాసాగర్ రావు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభం గురించి చర్చించిన తరువాత ఈరోజు చెన్నైకు చేరుకొన్నారు. వెంటనే ఆయనను కలిసేందుకు ముఖ్యమంత్రి పళనిస్వామి అపాయింట్ మెంట్ కోరగా గవర్నర్ నిరాకరించినట్లు తాజా సమాచారం. కనుక తమిళనాడు రాజకీయాలలో మళ్ళీ రేపు ఏదో ఉత్కంట కలిగించే పరిణామమేదో జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. 


Related Post