కేసులు తప్పవు..అప్రదిష్ట తప్పదు

September 19, 2017


img

తెలంగాణా ప్రభుత్వం రాష్ట్రంలో పేద మహిళలకు బతుకమ్మ పండుగ సందర్భంగా అందిస్తున్న చీరలు నాసిరకంగా ఉన్నాయంటూ కొన్ని జిల్లాలలో మహిళలు వాటిని రోడ్లపై కుప్పపోసి తగులబెట్టడంపై మంత్రి కేటిఆర్ సీరియస్ అయ్యారు. ఇది ప్రతిపక్షాల నీచ రాజకీయాలకు పరాకాష్ట అని చెపుతూనే, బతుకమ్మ చీరలను తగులబెట్టినవారిపై కేసులు తప్పవని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఊహించని ఈ పరిణామాలపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నందున ఆయన సూచన మేరకే కేటిఆర్ కేసులు తప్పవని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనల వెనుక ప్రతిపక్షాలు ఉన్నాయని తెరాస నేతలు ఆరోపిస్తున్నందున, వాటిపై విచారణ జరిపి నివేదికలు పంపవలసిందిగా ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు సమాచారం. 

అయితే చీరలు నాసిరకంగా ఉన్నాయని మహిళలు ఆరోపిస్తున్నప్పుడు ముందుగా వారు చేస్తున్న ఆరోపణలు నిజమా కాదా అని తెలుసుకొనే ప్రయత్నం చేస్తే బాగుండేది. కానీ చీరలు తగులబెట్టిన వాళ్ళు అందరూ ప్రతిపక్షాలకు చెందినవాళ్ళే అని భావించి వారిపై కేసులు పెడితే తెరాస సర్కార్ పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుంది. 

తాము పంపిణీ చేస్తున్న చీరలు చాలా నాణ్యమైనవేనని మంత్రి కేటిఆర్, ఎంపి కవిత తదితరులు గట్టిగ వాదిస్తున్నప్పుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ చేసిన తాజా ప్రకటన అవి నాసిరకమైనవేనని దృవీకరించినట్లయింది.  అయన మీడియాతో మాట్లాడుతూ, “అటు చేనేత కార్మికులను ఆదుకొంటూ ఇటు రాష్ట్రంలోని నిరుపేద మహిళలకు పండుగపూట కొత్త చీరలు అందించాలనే తపనతోనే ప్రభుత్వం ఈ బతుకమ్మ చీరల పంపిణీని ప్రారంభించింది.  ఇది ఇంకా ఆరంభం మాత్రమే మున్ముందు ఒక్కొక్కరికీ రూ.1,000 ఖరీదు చేసే చీరలు పంచిపెట్టడానికి ప్రయత్నిస్తాము,” అని అన్నారు. 

అంటే ప్రస్తుతం పెట్టిన బతుకమ్మ చీరలు కాస్త నాసిరకమైనవేనని ఇక ముందు ఖరీదైన మంచి చీరలు పెడతామని చెపుతున్నట్లే ఉంది. కనుక చీరల నాణ్యతలో లోపాలు ఏమైనా ఉన్నాయేమో విచారణ చేసి తెలుసుకొంటే మంచిది కదా! ఒకవేళ అవి నిజంగా నాసిరకం చీరలే అయితే వాటిని మహిళలు తిరస్కరిస్తే అప్పుడు కూడా ప్రభుత్వానికే అప్రదిష్ట కదా! 


Related Post