మహిళలపై కేసులు పెడితే ఎవరికి నష్టం?

September 19, 2017


img

తెరాస సర్కార్ ఒక మంచి ఉద్దేశ్యంతో చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం దురదృష్టవశాత్తు రసాబాసగా మారింది. దానిపై అధికార, ప్రతిపక్షాల మద్య భీకరయుద్ధం మొదలైంది. ఇరు వర్గాలు దేని వాదనలు అవి వినిపిస్తున్నాయి. ఇటువంటి మంచి కార్యక్రమంపై కూడా ప్రతిపక్షాలు నీచరాజకీయాలు చేస్తున్నాయని తెరాస వాదిస్తుంటే, నాసిరకమైన చీరలు ఇచ్చి తెరాస సర్కార్ మహిళలను అవమానించిందని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. 

ప్రతిపక్ష శాసనసభ్యులున్న జిల్లాలు, నియోజకవర్గాలలోనే బతుకమ్మ చీరలకు మహిళలు నిప్పుపెడుతున్నారని తెరాస వాదిస్తోంది. వారు మహిళలకు నయాన్నో భయన్నో నచ్చజెప్పి వీలుకాకుంటే వారి చేతుల్లో నుంచి బలవంతంగా ఆ చీరలు గుంజుకొని రోడ్లపై పోసి నిప్పు పెట్టి ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలుచేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెరాస వాదిస్తోంది. బతుకమ్మ పండుగకు ఇచ్చిన చీరలను తగులబెట్టడం మంచిది కాదని వాదిస్తున్నారు. 

తెరాస నేతలు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు అందరూ ఇదే పాటపాడటం గమనిస్తే, ప్రభుత్వానికి అప్రదిష్ట కలిగిస్తున్న ఈ సమస్యను ఎదుర్కోవడానికి తెరాస ఈ వాదనను సిద్దం చేసుకొన్నట్లు స్పష్టం అవుతోంది. మహిళల ఆగ్రహం నుంచి, ప్రతిపక్షాల విమర్శల నుంచి తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం తప్పదు కనుక వారి వాదనలను తప్పు పట్టలేము. 

అయితే ఏ తెలంగాణా ఆడపడచులకు ఈ ఆత్మీయ కానుకను ఇస్తోందో ఇప్పుడు వారిపైనే పోలీస్ కేసులు పెడుతోంది. దాని వలన బతుకమ్మ చీరలు ఇచ్చిన మంచిపేరుపోయి, ఆడపడచులను కూడా వేధిస్తోందనే అప్రదిష్ట మూటగట్టుకొనే ప్రమాదం ఉంది. బతుకమ్మ పండుగ చేసుకోవలసిన మహిళలను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పితే తెరాస తను కూర్చొన్న కొమ్మను తనే నరుకొన్నట్లవుతుంది. మహిళలపై కేసులు పెడితే అది ప్రతిపక్షాలకు మరో బలమైన ఆయుధం అందించినట్లే అవుతుందని గ్రహిస్తే మంచిది. 

ఇక ప్రతిపక్షాలు ఇటువంటి అవకాశం కోసమే పొంచి ఉన్నాయని తెరాసకు తెలిసి ఉన్నప్పుడు, చీరల తయారీలో నాణ్యతను పాటించి వాటిని సజావుగా పంపిణీ చేయడానికి తగిన జాగ్రత్తలు, ఏర్పాట్లు చేసుకొని ఉండాలి. కానీ జరుగకూడని నష్టం జరిగిపోయిన తరువాత ఇప్పుడు ఆకులు పట్టుకొని ఏమి ప్రయోజనం? 

బతుకమ్మ చీరల తయారీ, పంపిణీ గురించి తెరాస మంత్రులు, నేతలు చాలా గొప్పలు చెప్పుకోవడం వలననే ఆ చీరలపై మహిళలు అంచనాలు పెరిగిపోయి వాటికోసం ఆశపడ్డారు. కానీ అవి వారి అంచనాలకు తగ్గట్లుగా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని భావించవచ్చు. ఇటువంటి పరిస్థితులలో ప్రభుత్వం సంయమనంతో వ్యవహరించాలి. కానీ ప్రభుత్వం కూడా వారిపై ప్రతిపక్షాల ముద్రవేసి కేసులు పెడుతోంది. 

ఇదివరకు ఖమ్మం మార్కెట్ యార్డు కార్యాలయం విద్వంసం కేసులోను ప్రభుత్వం ఇలాగే తప్పటడుగులు వేసి అప్రదిష్ట పాలైంది. అప్పుడు రైతులపై ప్రతిపక్ష కార్యకర్తల ముద్ర వేసి కేసులు పెడితే ఇప్పుడు మహిళలపై ప్రతిపక్షాల ముద్రవేసి కేసులు పెడుతోంది. దీని వలన ప్రభుత్వానికే మరింత అప్రదిష్ట, ప్రజలలో వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుందని గ్రహిస్తే మంచిది. 


Related Post