ఎన్టీఆర్ కు ఇంకా ఆ ఆలోచనలు ఉన్నాయా?

September 19, 2017


img

ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన జై లవకుశ సినిమా మరో రెండు రోజులలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మీడియాకు ఇచ్చన తాజా ఇంటర్వ్యూలో రాజకీయాల గురించి విలేఖరి అడిగిన ప్రశ్నకు “భవిష్యత్ లో నేను రాజకీయాలలోకి రావచ్చు రాకపోవచ్చు. ప్రతీ మనిషి తన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తన దారిలో నుంచి పక్కకు వెళ్ళి మళ్ళీ దారిలోకి వస్తుంటాడు. అలాగే నేనూ వెళ్ళాను మళ్ళీ నా దారిలోకి వచ్చేసి ముందుకు సాగుతున్నాను. మళ్ళీ సరైన దారిలో ప్రయానిస్తునందుకు చాలా సంతోషంగా ఉంది.. గతంలో చేసిన తప్పులు (రాజకీయాలలో ప్రవేశించడం) సరిదిద్దుకొని ముందుకు సాగుతున్నాను. మళ్ళీ నన్ను ఇంతగా ఆదరించి ప్రోత్సహిస్తున్నందుకు నా దర్శకులు, అభిమానులకు కృతజ్ఞతలు చెప్పుకొంటున్నాను. ప్రస్తుతానికి నా దృష్టి అంతా నా సినిమాలపైనే ఉంది. కనుక ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడటం అనవసరం. మాట్లాడితే అది తొందరపాటే అవుతుంది,” అని సమాధానం చెప్పారు.

నిజానికి ఎన్టీఆర్ రాజకీయాలలో కూడా తన సత్తా చాటుకొన్నాడని అందరికీ తెలుసు. అతను అన్ని విధాలా తన తాత, తెదేపా వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్ కు అసలు సిసలైన వారసుడనిపించుకొన్నాడు. సరిగ్గా అదే అతనికి శాపంగా మారింది. ఒకే ఒక్క ఎన్నికల ప్రచారంతోనే స్వర్గీయ ఎన్టీఆర్ వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ అంత పేరు సంపాదించుకొన్నాడు. ఒకవేళ అతను తెదేపాలో, రాజకీయాలలో కొనసాగినట్లయితే ప్రజలలో, ప్రభుత్వంలో, పార్టీలో నారా లోకేష్ ను పట్టించుకొనేవారుండరనే భయంతోనే చంద్రబాబు నాయుడు మెల్లగా ఎన్టీఆర్ ను పక్కకు తప్పించేశారనే సంగతి అందరికీ తెలిసిందే. 

ఎన్టీఆర్ దురదృష్టం కొద్దీ అదే సమయంలో ఆయన ఆప్తమిత్రుడు కొడాలి నాని వైకాపాలో చేరడంతో అందరూ ఎన్టీఆర్ ను అనుమానంగా చూసే పరిస్థితులు ఏర్పడ్డాయి. అదే సమయంలో తెదేపాలో రగిలిన ఈ చిచ్చును మరింత పెంచడానికి స్వర్గీయ ఎన్టీఆర్, జూ.ఎన్టీఆర్ చిత్రాలతో కూడిన ఫ్లెక్సీ బ్యానర్లు వైకాపా పెట్టడంతో జూ.ఎన్టీఆర్ తెదేపాకు పూర్తిగా దూరం కావలసి వచ్చింది. 

ఆ తరువాత కూడా ఎన్టీఆర్ సినీపరిశ్రమలో నిలద్రొక్కుకోవడానికి చాలా కష్టాలు, సవాళ్లు ఎదుర్కోవలసి వచ్చింది. వాటి గురించి అందరికీ తెలుసు. కనుక ఎన్టీఆర్ మళ్ళీ రాజకీయాలవైపు తిరిగి చూడలేదు. పూర్తిగా తన సినిమాలకే అంకితమయిపోయారు. అదే మంచి నిర్ణయమని రుజువైంది కూడా. 

అయితే తన తప్పు ఏమీ లేకపోయినప్పటికీ అన్యాయంగా తనను బలిపశువును చేశారనే ఆవేదన ఎన్టీఆర్ కు ఎన్నటికీ వెంటాడుతూనే ఉంటుంది. కనుక ఏనాటికైనా అందుకు ప్రతీకారం తీర్చుకొని రాజకీయాలలో కూడా తన సత్తా చాటుకోవాలని ఎన్టీఆర్ అనుకొంటే తప్పులేదు. బహుశః అందుకే ‘నేనిక ఎన్నడూ రాజకీయాలలో  రాను’ అని చెప్పకుండా ‘భవిష్యత్ లో రావచ్చు..రాకపోవచ్చునని వాటి గురించి ఇప్పుడే మాట్లాడితే తొందరపాటు అవుతుందని’ సమాధానం చెప్పారు. కనుక రాజకీయాలలోకి రావాలనే ఆలోచనలు ఇంకా ఉన్నాయని స్పష్టం అవుతోంది. 


Related Post