కేంద్రప్రభుత్వం మొదలుపెట్టిన ‘స్వచ్చాతా హి సేవా’కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖులకు లేఖలు వ్రాశారు. ప్రధానమంత్రి నుంచి లేఖలు అందుకొన్న వారిలో దర్శకుడు రాజమౌళి, ప్రభాస్, మహేష్ బాబు, మోహన్ బాబు ఉన్నారు.
మహాత్మా గాంధీ స్ఫూర్తితో దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసం కేంద్రప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నంలో మీరు భాగస్వాములుగా చేరి, ఇతరులను కూడా ఈ మహాయజ్ఞంలో చేర్చవలసిందిగా ఆ లేఖల సారాంశం.
తెలుగు సినీ పరిశ్రమలో ప్రధాని నరేంద్ర మోడీతో అత్యంత సన్నిహితంగా పనిచేసిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ కు మాత్రం ఆహ్వానం అందలేదు. కారణాలు అందరికీ తెలిసినవే.
2014 ఎన్నికలలో మోడీ, చంద్రబాబులతో కలిసి ఎన్డీయే తరపున ప్రచారంలో పాల్గొని ప్రధాని మోడీ నుంచి ప్రశంశలు అందుకొన్న పవన్ కళ్యాణ్, ఆ తరువాత ప్రత్యేక హోదా అంశంపై కేంద్రప్రభుత్వం, భాజపాలను లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. వాటిని విమర్శిస్తూనే మరోపక్క తెదేపా దాని అధ్యక్షుడు చంద్రబాబుతో యధాప్రకారం తన స్నేహం కొనసాగిస్తుండటం విశేషం. పైగా వచ్చే ఎన్నికలలో జనసేన పోటీ చేయబోతోంది కనుక ఎన్నికల ప్రచారంలో ఈసారి కేంద్రప్రభుత్వం, భాజపాలపై విమర్శలు చేయడం తధ్యం. ఒకప్పుడు భాజపా విజయానికి తోడ్పడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు బద్ధశత్రువుగా మారిపోయాడు. బహుశః అందుకే పవన్ కళ్యాణ్ కు ప్రధాని మోడీ నుంచి ఆహ్వానం అందినట్లు లేదు.