రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపడితే, మొదటిరోజునే వాటి నాణ్యతపై మహిళలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ అనేకచోట్ల వాటిని తగులబెట్టడం, వెంటనే ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వంపై విమర్శలకు పూనుకోవడంతో చేనేత, జౌళి శాఖ మంత్రి కేటిఆర్ తీవ్రంగా స్పందించారు.
“గత ప్రభుత్వాలు కనీసం ఆలోచన చేయలేని అనేక సంక్షేమ పధకాలను మా ప్రభుత్వం అమలుచేసి చూపిస్తుంటే, ప్రతిపక్షాలు వాటిని స్వాగతించాల్సిందిపోయి సిగ్గులేకుండా వ్యతిరేకిస్తున్నాయి. బతుకమ్మ చీరల ద్వారా నేతన్నలకు చేతినిండా పని కల్పించాము. రాష్ట్రంలో పేద మహిళలకు ప్రభుత్వం తరపున పండుగకు చీరలు కానుకగా అందించాము. దీనిపై కూడా ప్రతిపక్షాలు నీచరాజకీయాలు చేయడం సిగ్గుచేటు. ఈ చీరల పంపిణీకి వారం రోజులు ముందుగానే ప్రతిపక్షాలు ఈ రాద్దాంతం చేయడానికి పక్కా ప్లాన్స్ వేసుకొన్నాయి. ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం మొదలవగానే రాద్దాంతం చేయడం మొదలుపెట్టాయి. ఇటువంటి నీచరాజకీయాలు చేసేవారికి ప్రజలే వచ్చే ఎన్నికలలో తగినవిధంగా బుద్ధి చెపుతారు. చీరల నాణ్యత, పంపిణీలో ఏవైనా లోపాలున్నట్లయితే ఆ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి కానీ శుభమా అని..బతుకమ్మ పండుగకు కానుకగా ఇచ్చిన చీరలను తగులబెట్టడం సరికాదు. ప్రతిపక్షాలు ఓర్వలేక చేస్తున్న ఇటువంటి నీచమైన పనులను మహిళలే త్రిప్పి కొట్టాలి. ప్రతిపక్షాలకు ఇష్టమున్నా లేకపోయినా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. మొదటిరోజునే సుమారు 25 లక్షల చీరలు పంపిణీ చేశాము. మిగిలినవి కూడా పంపిణీ చేస్తాము,” అని అన్నారు.