బతుకమ్మ చీరల రాజకీయాలు

September 18, 2017


img

తెరాస సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరలపై కూడా అప్పుడే రాజకీయాలు మొదలైపోయాయి. నాసి రకం చీరలు ఇచ్చినందుకు కొన్ని ప్రాంతాలలో మహిళలు వాటిని రోడ్లపై కుప్పపోసి తగులబెట్టి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

దీనిపై ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందించింది. చీరలు తగులబెట్టినందుకు భువనగిరిలో 11 మంది మహిళలపై పోలీసులు కేసులు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసేందుకే కాంగ్రెస్ నేతలు మహిళలను రెచ్చగొట్టి ఈవిధంగా చేయిస్తున్నారని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి ఆరోపించారు. కాంగ్రెస్, తెదేపా నేతలు చీరల పంపిణీ కేంద్రాల వద్ద ఉద్దేశ్యపూర్వకంగానే గొడవలు సృష్టించి ఆ తరువాత మహిళల చేతిలో నుంచి బలవంతంగా చీరలు గుంజుకొని వాటికి నిప్పుపెట్టి నీచ రాజకీయాలు చేస్తున్నారని రవి ఆరోపించారు. 

తమ ప్రభుత్వం ఒకవైపు నేతన్నలకు పని కల్పించి, మరోవైపు మహిళలకు ఆత్మీయ కానుకగా చీరలు అందిస్తుంటే ప్రతిపక్షాలు అది చూసి ఓర్వలేకనే ఇటువంటి నీచరాజకీయాలు చేస్తున్నాయని రవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.   

ఈ పరిణామాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ తీవ్రంగా స్పందించారు. ఈ బతుకమ్మ చీరల గురించి తెరాస సర్కార్ ఎన్నో గొప్పలు చెప్పుకొని చివరికి నాసిరకం చీరలు పంచిపెట్టి మహిళలను ఘోరంగా అవమానించిందని అన్నారు. పైగా నిరసన తెలిపినందుకు మహిళలపై కేసులు పెట్టడం దారుణమని అన్నారు. బతుకమ్మ చీరల పేరుతో ప్రభుత్వం అనవసరంగా రూ.220 కోట్ల ప్రజాధనం వృధా చేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

మరో రెండు రోజులపాటు బతుకమ్మ చీరల పంపిణీ సాగుతుంది కనుక మళ్ళీ ఇటువంటి ఘటనలు పునరావృతమైతే అది అధికార, ప్రతిపక్షాల మద్య రాజకీయ పోరాటాలను మరింత రాజేయవచ్చు. బతుకమ్మ చీరలు నాసిరకమనే వార్తలు నిజమైతే ఇక రేపటి నుంచి వాటికోసం వచ్చే మహిళల సంఖ్య తగ్గవచ్చు లేకుంటే చీరలు బాగానే ఉన్నట్లు భావించవలసి ఉంటుంది. 


Related Post