భాజపా ప్రశ్నకు తెరాస సమాధానం ఏమిటో?

September 18, 2017


img

తెలంగాణా విమోచన దినోత్సవం సందర్భంగా ఆదివారం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు తమతమ పార్టీ కార్యాలయాలపై మువ్వన్నెల జెండాలను ఎగురవేసి ఘనంగా వేడుకలు జరుపుకొన్నాయి. విశేషమేమిటంటే, బంజారా హిల్స్ లోని తెరాస కార్యాలయంలో రాష్ట్ర హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి పాల్గొని పార్టీ కార్యాలయంపై మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఆ సందర్భంగా ఆయన కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “తెలంగాణా రాష్ట్రావతరణ దినోత్సవం జరుపుకొంటున్నప్పుడు మళ్ళీ వేరేగా తెలంగాణా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోవలసిన అవసరం ఏమిటి? కానీ తెలంగాణా విమోచన దినోత్సవం పేరిట భాజపా మత రాజకీయాలు చేస్తూ ప్రజల మద్య చిచ్చుపెట్టడానికి ప్రయత్నిస్తోంది,” అని విమర్శించారు. 

తెరాస పార్టీ తరపున విమోచన దినోత్సవం జరుపుకోవడానికి అభ్యంతరం లేనప్పుడు దానినే తెరాస సర్కార్ అధికారికంగా నిర్వహించడానికి ఎందుకు వెనుకాడుతోంది? అని భాజపా నేతలు ప్రశ్నిస్తున్నారు. మజ్లీస్ నేతలు ఫత్వా జారీ చేస్తే దానిని తెరాస సర్కార్ అమలుచేస్తోందని ఎద్దేవా చేశారు.

భాజపా నేతల విమర్శలను పక్కన పెట్టి చూసినట్లయితే, పార్టీ తరపున తెరాస విమోచన దినోత్సవం జరుపుకొంటునప్పుడు దానినే అధికారికంగా నిర్వహించడానికి తెరాస సర్కార్ ఎందుకు భయపడుతోంది? అనే వారి ప్రశ్నకు తెరాస సర్కార్ జవాబు చెప్పవలసి ఉంటుంది.

రాష్ట్రావతరణ దినోత్సవం జరుపుకొంటున్నప్పుడు మళ్ళీ వేరేగా తెలంగాణా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోవలసిన అవసరం లేదని తెరాస నేతలు వాదిస్తున్నప్పుడు పార్టీ పరంగా ఎందుకు జరుపుకొంటున్నట్లు? అసలు తెలంగాణా విమోచన దినోత్సవం గురించి వారు ఏమనుకొంటున్నారో చెపితే బాగుండేది. ఒకపక్క దానిని గౌరవిస్తూనే మరోపక్క వ్యతిరేకించడం దేనికి? ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణా విమోచన దినోత్సవం జరిపితే నిజంగానే మజ్లీస్ పార్టీకి కోపం వస్తుందా?

తెలంగాణా విమోచన దినోత్సవం జరుపుకొంటే ప్రజల మద్య మత చిచ్చురగులుతుందని దాని భయమా లేక ముస్లిం ఓటు బ్యాంకును కోల్పోతామనే భయమా? అయినా విమోచన దినోత్సవం జరుపుకొంటే నిజంగానే ముస్లింలు తెరాసకు ఓట్లు వేయడానికి నిరాకరిస్తారా? అనే ప్రశ్నలకు తెరాస సర్కార్ బదులివ్వవలసి ఉంటుంది.  


Related Post