మరో పధకం ప్రకటించిన కేసీఆర్

September 18, 2017


img

దశాబ్దాలుగా తీవ్ర నిరాధారణకు గురైన తెలంగాణా రాష్ట్ర గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేసి గ్రామీణుల ఆర్ధికశక్తిని పెంచి తద్వారా వారి జీవితాలలో వెలుగులు నింపడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు వినూత్నమైన ఆలోచనలను అమలుచేస్తున్నారు. చేపలు, గొర్రెల పెంపకం ద్వారా గ్రామాలలో సంబంధిత కులాల ప్రజలకు ఆదాయమార్గం సృష్టిస్తున్న కేసీఆర్ ఇప్పుడు రాష్ట్రంలో పాడిపరిశ్రమ అభివృద్ధిపై దృష్టి పెట్టారు. 

ఆయన నిన్న విజయ, ముల్కనూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల డైరీ డెవల్‌పమెంట్ సొసైటీ సభ్యులతో ప్రగతి భవన్ లో సమావేశమయ్యి తన మనసులో ఆలోచనలను వారితో పంచుకొన్నారు.

"కర్ణాటక ప్రభుత్వం మాదిరిగానే విజయ డెయిరీ సభ్యులకు రూ.4 ఇన్సెంటివ్ ఇస్తున్నాం. వచ్చే వారం నుంచి విజయ డెయిరీ మాదిరిగానే నల్లగొండ, కరీంనగర్, రంగారెడ్డి సొసైటీలకు కూడా తప్పకుండా రూ.4 ఇన్సెంటివ్ చెల్లిస్తాము.  

రాష్ట్రంలో తగినంత పాల ఉత్పత్తి, సరఫరా లేనందున ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి పాలను దిగుమతి చేసుకోవలసివస్తోంది. గతంలో సమైక్య రాష్ట్రాన్ని పాలించిన ఒక పెద్ద మనిషి రాష్ట్రంలో పాడిపరిశ్రమను అభివృద్ధి చేసి పాల ఉత్పత్తి పెంచడానికి కృషి చేయకుండా, తన పాల వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకొన్నాడు. కనుక ఇకనైనా మనం పాడిపరిశ్రమను అభివృద్ధి చేసుకొని మనమే ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా చేసే స్థాయికి ఎదగాలి. 

రాష్ట్రంలో పాలకు విపరీతమైన డిమాండ్ ఉన్నప్పటికీ దానిని మనం ఉపయోగించుకొని లాభాపడలేకపోతున్నాము. కనుక డిమాడ్ కు తగ్గ ఉత్పత్తి, సరఫరా చేయడమే లక్ష్యంగా ఇప్పటి నుంచి కృషి చేద్దాము. దీనికోసం డెయిరీ డెవల్‌పమెంట్‌ సొసైటీల ద్వారా పాడిరైతులకు ప్రభుత్వం 50 శాతం సబ్సీడీ అందిస్తుంది. దళిత రైతులకైతే 75 శాతం సబ్సీడీ అందిస్తుంది. ఈ పధకాన్ని మరొక రెండు నెలలో అమలు చేస్తాము. గొర్రెల పంపిణీ పధకానికి అర్హులను ఏవిధంగా ఎంపిక చేశామో, బర్రెల పంపిణీకి అదేవిధంగా అర్హులను ఎంపిక చేస్తాము. రాష్ట్రంలో పాడిపరిశ్రమ అభివృద్ధి చెందితే మీ జీవితాలు బాగుపడతాయి. ఇతర రాష్ట్రాలపై మనం ఆధారపడవలసిన అవసరం ఉండదు. 

ఈ పధకం ద్వారా లబ్ది పొందేవారికి నాది ఒక విజ్ఞప్తి.  సబ్సీడిలో బర్రెలను పొందిన ప్రతీ పాడిరైతు తప్పనిసరిగా తన ఇంటి ఆవరణలో కనీసం ఆరు మొక్కలను నాటి వాటిని సంరక్షించాలి. అందరూ ఈవిధంగా ఇంటి ఆవరణలో మొక్కలు నాటుకొంటే మన ఊరు, రాష్ట్రం కూడా పచ్చగా అవుతుంది,” అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. 


Related Post