కాంగ్రెస్ కూడా రక్షణ కమిటీల ఏర్పాటు

September 16, 2017


img

తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన భూసర్వేను వ్యతిరేకిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కూడా 20,000 మందితో కూడిన రైతు రక్షణ కమిటీలను గ్రామ గ్రామాన్న ఏర్పాటు చేయబోతోంది. ఒక్కో గ్రామం నుంచి కనీసం ముగ్గురు కార్యకర్తల చొప్పున ఎంపిక చేసి వారికి సెప్టెంబర్ 18-22వరకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించబోతోంది. దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు మొదలైన వర్గాల వారిని ఎంపిక చేసుకొని శిక్షణ ఇస్తుంది. తెరాస సర్కార్ రైతు సమన్వయ సమితులను వాడుకొని ఏవిధంగా రాజకీయ ప్రయోజనం పొందాలని యోచిస్తోందో వారికి పార్టీలో సీనియర్ నేతలు వివరిస్తారు. 

శిక్షణ పూర్తిచేసుకొన్న తరువాత ఆ కార్యకర్తలు తమ తమ గ్రామాలలో రైతన్నలు కలిసి ఈ భూసర్వే వెనుక తెరాస సర్కార్ యొక్క అసలు ఉద్దేశ్యాలు ఏమిటో వారికి వివరించి ఆ ప్రక్రియను ప్రతిఘటించడానికి ప్రయత్నిస్తారు. ఈ శిక్షణ పొందిన కార్యకర్తలే తమ తమ గ్రామాలలో రైతులతో కూడిన ‘రైతు సంరక్షణ కమిటీ’లను ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితిల వలన రైతన్నలకు అన్యాయం జరుగకుండా అవి పోరాడుతాయి. ఈ కార్యక్రమానికి ‘ఇంటింటా ఇందిరమ్మ...ఊరంతా సౌభాగ్యం’ అని పేరు పెట్టాలని రాష్ట్ర కాంగ్రెస్ భావిస్తోంది. ఆ తరువాత వీరి ద్వారానే గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకొని 2019 ఎన్నికలలో విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. 

కాంగ్రెస్, తెరాసలు పోటాపోటీగా ఏర్పాటు చేయబోతున్న ఈ సమితులు, కమిటీల వలన గ్రామస్థాయి ప్రజలలో కూడా చీలికలు, విభేదాలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఆ రెండు పార్టీల మధ్య జరుగుతున్న రాజకీయ ఆధిపత్య పోరులో అనవసరంగా గ్రామీణులు నలిగిపోయే ప్రమాదం కనబడుతోంది. 


Related Post