చట్టబద్దతలేని వాటికి రూ.500 కోట్లు కేటాయిస్తే...

September 16, 2017


img

రైతు సమన్వయ సమితుల ఏర్పాటుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెపుతూ “ఆ సమితులు కేవలం సమన్వయ పాత్రకే పరిమితమవుతాయి తప్ప వాటికి ఎటువంటి ప్రత్యేక హక్కులు, అధికారాలు ఉండవు, అని చెప్పారు. 

ప్రభుత్వం నిజంగానే రైతుల సంక్షేమం కోసమే వాటిని ఏర్పాటుచేసి ఉండవచ్చు లేదా స్వామికార్యంతో పాటు స్వకార్యం (రాజకీయ ప్రయోజనాలు) కూడా చక్కబెట్టుకోవాలనే దూరదృష్టితో చేస్తున్నవికావచ్చు. కానీ వాటికి ప్రజాధనాన్ని కేటాయించబోతున్నప్పుడు లేదా వాటి ద్వారా ప్రజాధనం పంపిణీ అవుతున్నప్పుడు ప్రతిపక్షాలు ప్రశ్నించక మానవు. వాటికి సంతృప్తికరమైన సమాధానాలు చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది.  

ఏ హక్కులు, అధికారాలు లేని ఆ సమితులకు రూ.500 కోట్లు మూలధనం ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా చెప్పారు. ఎటువంటి చట్టబద్దత, అధికారాలు, హక్కులు లేని తెరాస కార్యకర్తలు, నేతలతో కూడిన వాటికి అంత బారీ సొమ్ము అప్పగిస్తున్నప్పుడు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే వాటికి సంతృప్తికరమైన సమాధానం చెప్పాలి కానీ వాటిపై ఆగ్రహం వ్యక్తం చేయడం, ఎదురుదాడి చేయడం ఎందుకు? 

వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వం రైతులకు ఇవ్వదలచుకొన్న ఎకరానికి రూ.8,000  సొమ్ము పంపిణీలో అర్హులైన రైతులను గుర్తించే బాధ్యత సమితులదా లేక రెవెన్యూశాఖదా లేక వ్యవసాయశాఖదా? తెరాస నేతల కనుసన్నలలో నడుస్తున్న ఆ సమితులు లబ్దిదారుల గుర్తింపులో జోక్యం చేసుకొనేమాటయితే అవి తమ పార్టీని వ్యతిరేకించేవారి పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తే అప్పుడు రైతులకు అన్యాయం జరుగదా?

ఏ హక్కులు, అధికారాలు, ఆర్ధిక, రాజకీయ లాభం లేనప్పుడు వాటిలో సభ్యత్వం కోసం తెరాస నేతలు, కార్యకర్తలు ఎందుకు అంతగా పోటీలు పడుతున్నారు? వాటిలో ప్రతిపక్షాలకు చెందినవారికి ప్రభుత్వం ఎందుకు చోటు కల్పించడం లేదు? అసలు రైతు సమన్వయ సమితులకు ప్రభుత్వం ఎటువంటి మార్గదర్శకాలు రూపొందించింది?

చట్టబద్దంగా పనిచేస్తున్న ప్రభుత్వం వ్యవస్థలలో లోపాలనే ప్రశ్నిస్తున్నప్పుడు, కేవలం ఒక జీవో ద్వారా రూపొందించబడి బారీ ఆర్ధిక లావాదేవీలను పర్యవేక్షనుంచనున్న ఈ సమితుల ఏర్పటుపై ఇటువంటి సందేహాలు వ్యక్తం అవడం సహజమే. ప్రతిపక్షాలు ప్రశ్నించడం తప్పు, నేరమూ కాదని చెప్పక తప్పదు. 


Related Post