దానికి భాజపా సమాధానం ఏమిటో?

September 16, 2017


img

రేపు సెప్టెంబర్ 17వ తేదీ. నిజాం నవాబుల నిరంకుశ పాలన నుంచి తెలంగాణా విముక్తి పొందిన రోజు. దీనిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని భాజపా గత మూడేళ్ళుగా డిమాండ్ చేస్తోంది. మొదట్లో భాజపాకు జవాబు చెప్పడానికి తెరాస తడబడేది కానీ ఇప్పుడు వారికి గట్టిగా సమాధానం చెప్పడమే కాకుండా దానినే ఆయుధంగా మలుచుకొని తిరిగి ఎదురుదాడి చేస్తోంది కూడా. 

రాష్ట్రంలో తన ఉనికిని చాటుకోవడం కోసమే భాజపా ఈ అంశాన్ని పట్టుకొని హడావుడి చేస్తోందని మంత్రి కేటిఆర్ ఎద్దేవా చేశారు. తన స్వార్ధ రాజకీయాల కోసం విమోచన దినోత్సవం పేరిట ప్రజల మద్య మత చిచ్చు పెట్టడానికి కూడా వెనకాడటంలేదని విమర్శించారు. ఒకప్పుడు సమైక్య రాష్ట్రంలో తెలంగాణా ఉనికిని చాటుకోవడానికి తాము విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసిన మాట వాస్తవమని కానీ ఇప్పుడు ఏటా అందరూ గర్వంగా, సంతోషంగా తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకొంటున్నప్పుడు మళ్ళీ విమోచన దినోత్సవం జరుపుకోవలసిన అవసరం ఏమిటని మంత్రి కేటిఆర్ ప్రశ్నించారు.

విమోచన దినోత్సవం చేయాలని ఇంతకాలం పట్టుబడుతూ తెరాసను ఇబ్బందిపెట్టిన భాజపా ఇప్పుడు కేటిఆర్ అడిగిన ప్రశ్నకు సమాధానాలు చెప్పలేక తడబడుతోంది. విమోచన దినోత్సవం ఎందుకు చేయవలసిన అవసరం లేదో చెప్పిన కేటిఆర్ ఇప్పుడు ఎందుకు తప్పకుండా చేయాలో చెప్పవలసిన పరిస్థితిని భాజపాకు కల్పించారు. తెరాస కనుగొన్న ఈ విరుగుడు మంత్రాన్ని ఇప్పుడు ఆ పార్టీ నేతలు అందరూ వల్లిస్తుండటంతో రాష్ట్ర భాజపా నేతలు వారికి సమాధానం చెప్పలేక తడబడుతుండటం విశేషం. 

 భాజపా ఎంత హడావుడి చేసినప్పటికీ దీని నుంచి ఆశించినంత రాజకీయ మైలేజీ దానికి లభించలేదనేది వాస్తవం. అయినప్పటికీ రేపు ఆ పేరుతో నిజామాబాద్ లో బహిరంగ సభ నిర్వహించడానికి సిద్దం అవుతోంది. అయితే ఇటువంటి అంశం పట్టుకొని పోరాడటం కంటే, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పద్దతిలో పార్టీని గ్రామస్థాయి నుంచి పునర్నిమించుకొంటూ వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి బలమైన అభ్యర్ధులను తయారుచేసుకొనే ప్రయత్నాలు చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. అలాగే తెరాస పట్ల తమ పార్టీ వైఖరి ఏమిటో తెలుసుకోకుండా ఇప్పుడు విమర్శలు గుప్పిస్తే భవిష్యత్ లో దానితోనే చేతులు కలుపవలసివస్తే ఇబ్బందిపడేది తామేనని గ్రహిస్తే మంచిది. 

తాము అధికారంలోకి వస్తే తెలంగాణా విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తామని రాష్ట్ర భాజపా నేతలు చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎన్నికలలో పోటీ చేయడానికి పార్టీలో తగినంతమంది అభ్యర్ధులే లేనప్పుడు ఈవిధంగా చెప్పుకోవడం చూసి ప్రజలు కూడా నవ్వుకొంటారు. ప్రజలు ఏ పార్టీకి ఓటేస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందని చూస్తారు తప్ప ఏది విమోచనదినాన్ని అధికారికంగా జరుపుతుందని చూసి ఓటేయరు. ఇంత చిన్న విషయాన్ని రాష్ట్ర భాజపా నేతలు గ్రహించలేకపోయారంటే విచిత్రమే కదా? కనుక తమ అధ్యక్షుడు అమిత్ షా సూచనలను అనుసరిస్తే 2019 లో కాకపోయినా ఎప్పటికైనా అవకాశం లభిస్తుంది. 


Related Post