కమల్ ప్రతిపాదన బాగానే ఉంది కానీ...

September 16, 2017


img

తమిళనాడు రాజకీయాలలో రోజుకొక ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతున్నాయి. తను కొత్త రాజకీయపార్టీ పెట్టి త్వరలోనే ప్రత్యక్ష రాజకీయలలోకి రాబోతున్నానని ప్రకటించి కమల్ హాసన్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఈ సందర్భంగా అయన చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ, “సినిమాలు నా వృత్తి. రాజకీయాలు కాదు. కానీ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చూసి తప్పనిసరిగా రాజకీయాలలోకి ప్రవేశించవలసివస్తోంది.  నా సహనటుడు రజనీకాంత్ కూడా రాజకీయాలలోకి రావాలనుకొంటున్నట్లు విన్నాను. ఒకవేళ ఆయనకు అభ్యంతరం లేకపోతే నేను పెట్టబోయే కొత్తపార్టీలోకి ఆయనను సాదరంగా ఆహ్వానిస్తాను. ఆయనతో కలిసి పనిచేయడానికి నేను సిద్దం. ఇద్దరం కలిసే పార్టీని ముందుకు తీసుకువళ్ళవచ్చు,” అని అన్నారు. 

కమల్ హాసన్ చేసిన ప్రతిపాదన సహేతుకంగానే ఉందని చెప్పవచ్చు. వారిద్దరు వేర్వేరుగా పార్టీలు పెట్టుకొని రంగంలోకి దిగితే ఇద్దరూ నష్టపోవచ్చు లేదా పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్లు, ఏమాత్రం రాజకీయానుభవం లేని వారిరువురూ రాజకీయ ఆధిపత్యం కోసం పోరాడుకొంటుంటే, డిఎంకె లేదా అన్నాడిఎంకె లబ్దిపొందవచ్చు.  

ధైర్యంగా నిర్ణయాలు తీసుకోలేని రజనీకాంత్ స్వంతంగా పార్టీ పెట్టి చిరంజీవిలాగ భంగపడటం కంటే కమల్ హాసన్ తో చేతులు కలిపి పనిచేయడం అన్నివిధాలా మంచిది. ఒకవేళ వారిరువురూ నిజంగానే రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలనుకొంటున్నట్లయితే వారు తమ అహాలను, అభిప్రాయబేధాలను పక్కనపెట్టి చేతులు కలిపడమే మంచిది. అప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది వారి అభిమానులు కూడా ఏకం అవుతారు కనుక ఇక వారి పార్టీకి తిరుగు ఉండదు. అప్పుడు రాష్ట్రాభివృద్ధి కోసం వారు ఏమేమి చేయలానుకొన్నారో అవన్నీ చేయవచ్చు. వారి దృష్టిలో ఉన్న అన్ని ప్రజా సమస్యలను తీర్చవచ్చు. 

అయితే సింహంలాగ బ్రతకాలనుకొనే రజనీకాంత్, తనను విమర్శించే కమల్ హాసన్ ముందు చేతులు కట్టుకొని పనిచేయడానికి ఇష్టపడతారా? అంటే అనుమానమే. పైగా ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవన్నట్లు వారిరువురూ చేతులు కలిపి పనిచేయడం అసంభవమేననిపిస్తుంది. కానీ రజనీకాంత్ తన వయసు, ఆరోగ్యం, అభిమానుల కోరిక, రాష్ట్ర ప్రజల అవసరాల దృష్ట్యా కమల్ హాసన్ తో సర్దుకుపోవడమే అన్నివిధాల మంచిదని చెప్పవచ్చు. 


Related Post