అన్నిటికీ ఇంత తొందరైతే ఎలా రెడ్డిగారు?

September 15, 2017


img

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాస్త ఆవేశం ఎక్కువేనని అందరికీ తెలుసు. రాజకీయాలలో ఉన్నవారికి ఆవేశం ఉన్నా దానిని అదుపులో పెట్టుకోగలిగినవారే రాణిస్తారని చెప్పడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక చక్కటి ఉదాహరణగా చెప్పుకొంటే, అదుపులో పెట్టుకోలేనివారు తరచూ ఏవిధంగా ఎదురుదెబ్బలు తింటుంటారో తెలుసుకోవడానికి వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉదాహరణలుగా కనబడుతుంటారు. 

ఆ ఆవేశం కారణంగానే కోమటిరెడ్డికి ఇప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించాయి. మూడు నాలుగు రోజుల క్రితం ఆయన “ఉత్తం కుమార్ రెడ్డిని తక్షణం పిసిసి అధ్యక్ష పదవిలో నుంచి తొలగించకపోతే తాను కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళిపోతానని హెచ్చరించారు. ఆయన చేసిన ఈ హెచ్చరికలతో కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అవడం వెంటనే ఆ మరునాడు ‘నేను అలాగ అనలేదని’ మాట మార్చారు. కానీ పార్టీ విడిచిపెడతానని చెప్పిన మాటలు మీడియాలో ప్రముఖంగా వస్తుండటంతో తనంతట తానే నల్లగొండలో విలేఖరులతో సమావేశం ఏర్పాటుచేసుకొని కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్ళడం లేదని చెప్పుకోవలసి వచ్చింది. అయితే దాని కోసమే మీడియా సమావేశం అంటే ఇతర పార్టీలలోవారే కాకుండా స్వంత పార్టీలో వాళ్ళు కూడా నవ్వుకొంటారు కనుక ముందుగా యధాప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. 

జిల్లాలో నార్కట్‌పల్లి–ఎల్లారెడ్డి గ్రామాల వద్ద మెడికల్ కాలేజి నిర్మిస్తానని ఎన్నికల సమయంలో కేసీఆర్ హామీ ఇచ్చారని కానీ మూడున్నరేళ్ళు గడిచిపోయినా ఇంతవరకు అ హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. తక్షణమే అక్కడ మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మంజూరు చేయాలని లేకపోతే అక్టోబర్ 2 నుంచి 5వ తేదీ వరకు మూడురోజుల పాటు నిరాహార దీక్షకు కూర్చొంటానని హెచ్చరించారు. ఒకవేళ మెడికల్ కాలేజీకి నేనే అడ్డుపడుతున్నానని తెరాస నేతలు అనుకొంటుంటే, దాని కోసం తన పదవికి రాజీనామా చేయడానికి సిద్దంగా ఉన్నానని చెప్పారు. పేరులో ‘చంద్ర’ అనే పదం కలిగిన ముఖ్యమంత్రులు ఎప్పుడు రాజ్యం చేసినా ఆ రాష్ట్రంలో వానలు కురవక కరువుకాటకాలు ఏర్పడుతుంటాయని కోమటిరెడ్డి అన్నారు. కనుక కేసీఆర్ ది కూడా ‘ఐరెన్ లెగ్’ అని అన్నారు. అందుకే తెలంగాణాలో వర్షాలు కురవక కరువుకాటకాలు ఏర్పడ్డాయని అన్నారు.  

తరువాత తను చెప్పదలచుకొన్న అసలు విషయం గురించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో నుంచి నేను వెళ్ళిపోతాననే పుకార్లు నిజం కాదు. నేను వెళ్ళిపోతానని పుకార్లు పుట్టిస్తున్న వాళ్ళే ఏదోరోజున వెళ్ళిపోతారు తప్ప నేను ఎన్నడూ కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టను,” అని స్పష్టం చేశారు. 

కొసమెరుపు: “అక్కడ ఎలాగూ త్వరలో మెడికల్ కాలేజీ స్థాపనకు సన్నాహాలు జరుగుతున్నాయనే సంగతి పసిగట్టే ఆ క్రెడిట్ దక్కించుకోవడానికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి దొంగదీక్షలు చేయడానికి సిద్దం అవుతున్నాడు” అని ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. 


Related Post