అమెరికా గొప్పదనం ఎవరికి తెలియదు?

September 14, 2017


img

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ కు ఊహించని షాక్ ఇచ్చేరు. ప్రపంచంలో మాదకద్రవ్యాల ఉత్పత్తి, అక్రమ రవాణా చేస్తున్న 22 దేశాల పేర్లను ఆయన ప్రకటించారు. వాటిలో భారత్ పేరును కూడా చేర్చారు. 

భారత్ లో మాదకద్రవ్యాల ఉత్పత్తి, సరఫరా జరుగుతున్న మాట వాస్తవమే. వాటిని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద సీరియస్ సమస్యగా భావించకపోవడం వలన వాటిని అరికట్టడంలో అశ్రద్ధ, తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మాట కూడా వాస్తవమే. ఇటీవల హైదరాబాద్ లో పట్టుబడిన కెల్విన్ డ్రగ్స్ ముఠా ఇచ్చిన సమాచారంతో బయటపడిన విషయాలు , తరువాత జరిగిన అనేక పరిణామాలను చూసి అందరూ విస్తుపోయారు. కనుక మన దేశాన్ని ఆ జాబితాలో చేర్చినందుకు మనం ఉక్రోషం చెందనవసరం లేదు. కనీసం ఇప్పటికైనా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలన్నీ మేల్కొని డ్రగ్స్ ముఠాలను తరిమికొట్టాలి. 

అయితే గురువింద గింజ తన నలుపు ఎరుగదన్నట్లు ఇతర దేశాలను వేలెత్తి చూపుతున్న అమెరికా గురించి అందరికీ తెలుసు. దాని సామ్రాజ్య కాంక్షకు ప్రపంచంలో వియాత్నాం మొదలు ఇరాన్, ఇరాక్, కువైట్, సిరియా, ఆఫ్ఘానిస్తాన్ వరకు అనేక దేశాలు బలైపోయాయి. అమెరికా ఏ దేశంలో అడుగుపెడితే ఆ దేశం సర్వనాశనం కాకుండా ఎవరూ కాపడలేరని చెప్పడానికి ఆ దేశాలే ప్రత్యక్ష ఉదాహరణలు. ఇక అమెరికాలో గన్-కల్చర్ గురించి అందరికీ తెలిసిందే. నిత్యం దానికి ప్రజలు పసిపిల్లలు బలైపోతూనే ఉంటారు. అయినా గన్ కల్చర్ ను ట్రంప్ బలంగా సమర్ధించుకొంటారు. 

అమెరికా అగ్రరాజ్యంగా ఎదగడానికి తరతరాలుగా సేవలు అందించిన నల్లజాతీయుల పట్ల నేటికీ అమెరికాలో ఎంత వివక్ష ఉందో అందరికీ తెలుసు. నల్లజాతీయుడైన మాజీ అధ్యక్షుడు ఒబామాను అవహేళన చేస్తూ ఇటీవల ట్రంప్ పెట్టిన ఫోటో అందుకు తాజా నిదర్శనం. 

ప్రపంచాన్ని కొన్ని వందలసార్లు నాశనం చేయగల భయానకమైన అణ్వాయుధాలను పెరట్లో గుట్టలుగుట్టలుగా పెట్టుకొని, ప్రపంచ దేశాలకు సుద్దులు చెప్పడం అమెరికాకే చెల్లు. ఆ పేరుతో ఇరాక్ ను సర్వనాశనం చేసిన ఘనత కూడా అమెరికాదే. ప్రపంచంలో ఉండే ముస్లింలు అందరూ తీవ్రవాదులేననే మూర్కత్వమే ఆరు ముస్లిం దేశాల పై నిషేధం విధించేలా చేసిందని అందరికీ తెలుసు. 

ఇలాగ చెప్పుకొంటూపోతే...చాలానే ఉన్నాయి. కానీ అంతమాత్రన్న అమెరికాను ధూర్తదేశంగా భావించలేము. దూర్తదేశాల జాబితాలో అమెరికా పేరును ఇంతవరకు ఎవరూ చేర్చలేదు. కానీ అగ్రరాజ్యమనే అహంకారంతో అమెరికా మాత్రం ఎప్పుడూ ఈవిధంగానే వ్యవహరిస్తోంది. అందుకే కొన్ని గల్ఫ్ దేశాలు, ఉత్తర కొరియా అమెరికా పేరు చెపితే మండిపడుతుంటారు. అయితే ఎవరేమనుకొంటే నాకేమిటి...అనుకొంటారు ట్రంప్. దటీజ్ ట్రంప్!  


Related Post