ఆ ఎన్నికలలో కూడా ప్రతిపక్షాలు చేతులు కలపాలా?

September 14, 2017


img

సింగరేణిలో 14 కార్మిక సంఘాలు ఉన్నాయి. వాటిలో ఒక్కోటి ఒక్కో రాజకీయ పార్టీకి అనుబంధంగా పనిచేస్తుంటాయి. వచ్చేనెల 5న వాటికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికలలో ఏ కార్మిక సంఘం విజయం సాధిస్తే దానికే అధికారికంగా ‘గుర్తింపు సంఘం’ హోదా లభిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. 

సింగరేణిలో తెరాసకు అనుబంధంగా పనిచేస్తున్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి కొన్ని సంఘాలు మద్దతు ఇస్తుండగా మిగిలినవన్నీ దానిని వ్యతిరేకిస్తున్నాయి. వాటిలో సిపిఐకి అనుబంధంగా పనిచేస్తున్న ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటియుసి) కి కాంగ్రెస్, తెదేపాలు మద్దతు ఇవ్వాలని నిర్ణయించాయి. పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి, తెలంగాణా తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తదితరులు నిన్న సోమాజీగూడలోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో ఈ విషయాన్ని విలేఖరులకు తెలియజేశారు.

ఈ సందర్భంగా వారిరువురూ మీడియాతో మాట్లాడుతూ, “సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని కేసీఆర్ 2014 ఎన్నికలలో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీని నిలబెట్టుకోకుండా సింగరేణి కార్మికులను కూడా మోసం చేశారు. ఆనాడు సింగరేణి కార్మికులు అందరూ ఆయన మాయమాటలు నమ్మి తెరాసకు ఓటు వేయడం వలనే కేసీఆర్ ముఖ్యమంత్రి కాగలిగారు. కనీసం ఆ కృతజ్ఞత అయినా లేకుండా కోర్టు అభ్యంతరం చెప్పిందనే వంకతో తన హామీని పక్కన పడేసి కార్మికులను మోసం చేశారు. ఆయనకు గట్టిగా బుద్ధి చెప్పడానికి ఇదే మంచి అవకాశం. కనుక సింగరేణి కార్మికులు అందరూ నక్షత్రం గుర్తు కలిగిన ఏఐటియుసికే ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాము,” అని చెప్పారు. 

ఉత్తం కుమార్ రెడ్డితో సహా కాంగ్రెస్ నేతలందరూ వచ్చే ఎన్నికలలో తామే గెలిచి అధికారంలోకి రాబోతున్నామని చెపుతుంటారు. రాష్ట్రంలో తెదేపా పరిస్థితి క్షీణించినప్పటికీ అది కూడా తెరాసకు తామే ఏకైక ప్రత్యామ్నాయమని చెప్పుకొంటుంది. రాష్ట్రంలో రాజకీయ శూన్యత నెలకొని ఉందని భావించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర వ్యాప్తంగా మహాజన పాదయాత్రలు చేసి తెరాసకు తమ పార్టీయే ప్రత్యామ్నాయమని చెప్పుకొన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఇన్ని ప్రగల్భాలు పలుతున్న ప్రతిపక్షాలు సింగరేణి యూనియన్ ఎన్నికలలో తెరాస అనుబంధ సంఘాన్ని ఎదుర్కోవడానికి చేతులు కలుపుతున్నాయంటే వాటి వాస్తవ శక్తి ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. మరి 2019 ఎన్నికలలో ఏవిధంగా తమంతట తామే గెలిచి అధికారంలోకి రాగలమని కలలు కంటున్నాయో వాటికే తెలియాలి. ఏపిలో ఆగర్భ శత్రువులులాగ వ్యవహరించే కాంగ్రెస్, తెదేపాలు, తెలంగాణాలో ఈవిధంగా రాసుకుపూసుకు తిరగడం మరీ విడ్డూరం. అదేవిధంగా ఇటువంటి సందర్భాలలో ఒకరికొకరు మద్దతు ఇచ్చుకొంటూ, మిగిలిన సమయాలలో ఒక పార్టీని మరొకటి విమర్శించుకోవడం వాటి ద్వంద వైఖరికి అద్దం పడుతోంది. 


Related Post