నేరెళ్ళ వ్యవహారంలో ప్రభుత్వం తప్పటడుగులు వేస్తోందా?

September 12, 2017


img

నేరెళ్ళ ఘటనపై హైకోర్టు ఈరోజు విచారణ జరిపినప్పుడు బాధితుల గాయాల గురించి నివేదిక అందించడంలో వారికి వైద్యం అందించడంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పు పట్టింది. ఈ ఘటన జరిగిన సమయానికి అంటే జూలై 8న గాయపడినవారి ఆరోగ్యపరిస్థితి గురించి నివేదిక సమర్పించాలని కరీంనగర్ జైలు అధికారులను, వారికి వైద్యం చేసిన వైద్యులను కోర్టు ఆదేశించింది. అలాగే పిటిషనర్ అభ్యర్ధన మేరకు గాయపడిన 8మందిలో ఇద్దరిని హైదరాబాద్ నీమ్స్ ఆసుపత్రిలో చేర్చి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించింది. ఈ కేసు విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. 

నేరెళ్ళ ఘటనలో తెరాస సర్కార్ సకాలంలో సరిగ్గా స్పందించకపోవడంతో చాలా అప్రదిష్ట మూటగట్టుకొంది. ఆ తరువాత అయినా అప్రమత్తంగా వ్యవహరించి ఉంటే బాగుండేది. కానీ నీమ్స్ ఆసుపత్రిలో చేరిన నేరెళ్ళ దళితులను బలవంతంగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయించడం వలన ఇంకా విమర్శల పాలైంది. ఆరోగ్యశాఖా మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి తమ చర్యను ఎంతగా సమర్దించుకొన్నప్పటికీ అది ప్రజలకు, ముఖ్యంగా దళితులకు తప్పుడు సంకేతాలు పంపినట్లు అయ్యింది. కనుక ఎవరి పొరపాటు వలన ఇటువంటి తప్పిదాలు పునరావృతం అవుతున్నా అంతిమంగా తెరాస సర్కారే ఆ అప్రదిష్ట, నిందలు, విమర్శలు, న్యాయస్థానంలో ఈవిధమైన మొట్టికాయలు భరించవలసి ఉంటుంది. భవిష్యత్ లో అవి తెరాసకు రాజకీయంగా నష్టం కలిగిచే ప్రమాదం కూడా ఉంటుంది కనుక ఇకనైనా ఇటువంటి తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తపడితే మంచిది.  


Related Post