ప్రధాని పదవి చేపట్టేందుకు నేను రెడీ

September 12, 2017


img

దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు ఒక శుభవార్త. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవిని చేపట్టేందుకు ఇప్పుడు సిద్దంగా ఉన్నారుట! అంటే వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ తరపున ప్రధానమంత్రి అభ్యర్ధిగా బరిలోకి దిగడానికి అన్నమాట.

ఆయన కాలిఫోర్నియా యూనివర్సిటీలో భారతీయ విద్యార్ధులను ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.  వారసత్వ రాజకీయాలపై ఒక ప్రశ్నకు సమాధానం చెపుతూ “సమాజ్ వాదీ పార్టీ, ఆర్.జె.డి, డిఎంకె, తెదేపా, తెరాస ఇలాగ అనేక పార్టీలలో వారసత్వం కొనసాగుతోంది. రాజకీయాలలోనే కాకుండా సిని, వ్యాపార రంగాలలో కూడా వారసత్వం కొనసాగుతోంది. కనుక వారసత్వ రాజకీయాలలో నేనే మొదటి వ్యక్తిని కాను,” అని జవాబు చెప్పారు.

ఇక ప్రధానమంత్రి పదవికి పోటీ చేస్తారా? అనే ప్రశ్నకు ‘చేస్తాను’ అని విస్పష్టంగా సమాధానం చెప్పారు.  అయితే తమది సంస్థాగత పార్టీ కనుక దీనిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకొంటామని చెప్పారు.  

నోట్ల రద్దు, జి.ఎస్.టి.అమలు వంటి దుందుడుకు నిర్ణయాల వలన దేశ ఆర్ధిక, పారిశ్రామిక వ్యవస్థలు చిన్నాభిన్నం అయిపోతున్నాయని, మతరాజకీయలతో ప్రజల మద్య చిచ్చుపెట్టాలని భాజపా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ పదేళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి పదవిని చేపట్టమని ఎవరు ఎంతగా ఒత్తిడి చేసినప్పటికీ దానిని చేపట్టేందుకు రాహుల్ గాంధీ భయపడి వెనుకంజవేశారు. తరువాత ఆయన పార్టీ పగ్గాలు చేపట్టబోతే పార్టీలో సీనియర్ నేతలే అభ్యంతరం చెప్పడంతో వెనక్కు తగ్గవలసి వచ్చింది. పార్టీ పగ్గాలే చేపట్టలేని దుస్థితిలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి పదవికి పోటీచేస్తానని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది.

తమది సంస్థాగత పార్టీ అని, దానిలో చర్చించుకొన్నకనే తన అభ్యర్ధిత్వంపై నిర్ణయం తీసుకొంటామని చెపుతున్నప్పుడు మళ్ళీ తాను ప్రధాని పదవికి పోటీ పడతానని చెప్పుకోవడం కూడా తప్పే. అయినా వచ్చే ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు లేవని అనేక సర్వే ఫలితాలు చాటి చెపుతున్నప్పుడు రాహుల్ గాంధీ ఇటువంటి ప్రకటన చేయడం తొందరపాటే అవుతుంది. 


Related Post