మా తాత బాటలోనే నేను నడుస్తా!

September 12, 2017


img

తెరాస ఎంపి డి. శ్రీనివాస్ కుమారుడు డి. అరవింద్ త్వరలో తాను భాజపాలో చేరబోతున్నట్లు దృవీకరించారు. ఆయన నిజామాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, “అవును నేను త్వరలో భాజపాలో చేరబోతున్నాను. ఈ విషయం మా నాన్నగారికి ముందే చెప్పాను. నా ఆలోచనలు, భావజాలానికి భాజపా మాత్రమే సరిపోతుందని గ్రహించాను.  ఒకప్పుడు మా తాతగారు ఆర్.ఎస్.ఎస్.కార్యకర్త. నేను కూడా ఆయన బాటలోనే నడవాలనుకొంటున్నాను. మా నాన్నగారు ఏ పార్టీలో కొనసాగుతారనేది ఆయన ఇష్టం. మన దేశానికి ప్రస్తుతం నరేంద్ర మోడీ వంటి బలమైన నాయకుడే కావాలి. ఆయన  నాయకత్వంలో దేశం అభివృద్ధిపదంలో దూసుకుపోతోంది. భాజపా అధిష్టానం నాకు ఏ బాధ్యత అప్పగించినా స్వీకరిస్తాను. వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రావడం ఖాయం. అందుకోసం నేను కూడా ఇప్పటి నుంచే శ్రమిస్తాను,” అని చెప్పారు.

తెరాసలో తమకు సరైన గుర్తింపు, ప్రాధాన్యత లభించడం లేదనే కారణంగానే డి.శ్రీనివాస్, ఆయన ఇద్దరు కుమారులు గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే తన కుమారుడు అరవింద్ భాజపాలో చేరినప్పటికీ తాను తెరాసలోనే కొనసాగుతానని డిఎస్ చెప్పారు. కానీ తండ్రికొడుకులు ముగ్గురూ తెరాసలో ఉన్నప్పుడే ప్రాధాన్యత లభించనప్పుడు వారిలో ఒకరు ఇప్పుడు ప్రత్యర్ధి పార్టీలో చేరితే పార్టీలో అందరూ ఆయనను అనుమానంగా చూస్తారు కనుక డిఎస్ కు తెరాసలో ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవ వచ్చు. కనుక ఆయన కూడా భాజపాలో టికెట్ ఖాయం చేసుకొన్నాక తెరాసకు గుడ్ బై చెప్పేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.   


Related Post