కోమటిరెడ్డికి గొప్ప అవకాశం!

September 11, 2017


img

నల్లగొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చాలా సంతోషంకలిగే వార్త ఇది. అయితే అది అయన స్వంత పార్టీకి సంబంధించింది కాదు. తెరాసకు సంబంధించిన వార్త. అయినా సంతోషం కలిగించకమానదు. అదేమిటంటే.. కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపిగా ఎన్నికై తెరాసలో చేరిన గుత్తా సుఖేందర్ రెడ్డి తన ఎంపి పదవికి ఈరోజు రాజీనామా చేశారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఖచ్చితంగా 106 సీట్లు గెలుచుకొంటామని చెపుతుంటారు. కనుక ఆయనకు నిజంగా అంత నమ్మకముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి ఉపఎన్నికలలో తన సత్తా నిరూపించుకోవాలని ప్రతిపక్షాలు సవాళ్ళు విసురుతుంటాయి. వాటి సవాళ్ళకు గట్టిగా బదులివ్వాలనే ఉద్దేశ్యంతోనే గుత్తా చేత రాజీనామా చేయించినట్లు తెలుస్తోంది. కానీ అందుకు వేరే కారణం కూడా ఉండి ఉండవచ్చు. గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ నెల 14న లోక్ సభ స్పీకర్ ను కలిసి స్వయంగా తన రాజీనామా పత్రాన్ని అందజేయబోతున్నట్లు తాజా సమాచారం. 

గుత్తా రాజీనామా చేస్తే కోమటిరెడ్డికి ఎందుకు సంతోషం అంటే, అయనకు దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ గెలవాలని కోమటిరెడ్డి సవాలు విసిరారు. అవసరమైతే తానే ఆయనపై పోటీ చేసి చిత్తుచిత్తుగా ఓడిస్తానని అన్నారు. నల్లగొండలో తాను ఉన్నంత కాలం జిల్లాలో ఎక్కడి నుంచైనా సరే ఏ తెరాస నేత పోటీ చేసి గెలవలేడు అని కోమటిరెడ్డి గతంలో ప్రకటించారు. కనుక ఇప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డిని లేదా ఆయన స్థానంలో పోటీ చేయబోయే తెరాస నేతను ఓడించి తన సత్తా నిరూపించుకోవచ్చు. 

పిసిసి అధ్యక్షుడుగా ఉత్తం కుమార్ రెడ్డి ఉన్నట్లయితే తాము కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేనని కోమటిరెడ్డి ఈరోజే అన్నారు. సరిగ్గా ఇదే సమయంలో గుత్తా తన ఎంపి పదవికి రాజీనామా చేయడం చూస్తే ఈ రెండు పరిణామాలకు మద్య ఏమైనా సంబంధం ఉందా? అనే అనుమానం కలుగుతోంది. 

కోమటిరెడ్డి ఎలాగూ కాంగ్రెస్ పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారు కనుక ఆయనను తెరాసలో చేర్చుకోవడానికే గుత్తా చేత కేసీఆర్ రాజీనామా చేయించారా? అనే అనుమానం కూడా ఉంది. ఏమైనప్పటికీ అటు తెరాస, ఇటు కోమటిరెడ్డికి తమ సత్తా మరోమారు నిరూపించుకొనేందుకు మంచి వేదిక లభించిందని చెప్పవచ్చు. 


Related Post