అయితే జంప్ చేసేస్తాం: కోమటిరెడ్డి

September 11, 2017


img

 కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డిపై మళ్ళీ ఈరోజు తీవ్ర విమర్శలు చేశారు. “నేను వదిలేసిన మంత్రి పదవిని దక్కించుకొని అధిష్టానం వద్ద లాబీయింగ్ చేసుకొని ఆయన పిసిసి అధ్యక్షుడయ్యాడు. గత ఎన్నికలలో ఆయన అసమర్ధత వలననే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. మళ్ళీ వచ్చే ఎన్నికలలో కూడా ఆయన నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్ళినట్లయితే ఈసారి పార్టీకి కనీసం 5-6 సీట్ల కంటే ఎక్కువ రావు. ఇప్పటికీ ఇంకా సమయం మించిపోలేదు. కనుక ఆయనను వెంటనే ఆ పదవిలో నుంచి తప్పించి సమర్ధుడైన నాయకుడి చేతికి పార్టీని అప్పగిస్తే మంచిది. ఆయన మా ఇద్దరు సోదరులను పార్టీ నుంచి బయటకు పంపేందుకు లోలోన చాలా కుట్రలు పన్నుతున్నారు. సోషల్ మీడియాలో మా ఇద్దరికీ వ్యతిరేకంగా ప్రచారం చేయిస్తున్నారు. ఆయనను వెంటనే ఆ పదవిలో నుంచి తప్పించకపోతే ఇక మేము ఎంతో కాలం పార్టీలో ఉండలేము,” అని ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ విలేఖరితో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 

ఉత్తం కుమార్ రెడ్డిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదటి నుంచే తీవ్ర వ్యతిరేకత ప్రదర్శిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయనను ఆ పదవిలో నుంచి తప్పించి తనకు పిసిసి అధ్యక్షుడిగా అవకాశం కల్పించాలని అధిష్టానాన్ని కోరారు. కానీ అయన డిల్లీ వెళితే సోనియా గాంధీ కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు. పైగా దిగ్విజయ్ సింగ్ స్థానంలో కొత్తగా రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జ్ గా బాధ్యతలు చేపట్టిన రామచంద్ర కుంతియా “ఉత్తం కుమార్ రెడ్డి నేతృత్వంలోనే కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలను ఎదుర్కొంటుంది. ఆయనను మార్చే ప్రసక్తి లేదు. రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఏవిషయంలోనైనా ఆయనదే అంతిమ నిర్ణయం. అందరూ ఆయన మాటకు కట్టుబడి ఆయన నేతృత్వంలోనే పనిచేయాలి. ఎదురుతిరిగినవారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవు,” అని గట్టిగా హెచ్చరించారు. 

సిఎల్పి నేత జానారెడ్డి కూడా పిసిసి అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. ఆయనకు కోమటిరెడ్డి సోదరులు మద్దతు ఇస్తున్నారు. కనుక కుంతియా ఆదేశాలను జీర్ణించుకోవడం కోమటిరెడ్డితో సహా అనేకమంది సీనియర్ కాంగ్రెస్ నేతలకు కష్టమే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎలాగూ మొదటి నుంచి ధిక్కారస్వరం వినిపిస్తూనే ఉన్నారు. కనుక ఆయన నోటితోనే ఈ నాలుగు ముక్కలు వారు పలికించేసినట్లున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో రాబోయే ముసలానికి దీనిని మొదటి సంకేతంగా భావించవచ్చు. కనుక తెరాసను ఓడించి రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నేతలు కలలుకనే ముందు ఇటువంటి అంతర్గత సమస్యలను పరిష్కరించుకొంటే మంచిది కదా!



Related Post