కేసీఆర్ అపర భగీరదుడే: భాజపా నేత

September 11, 2017


img

రాష్ట్ర భాజపా నేతలు తెలంగాణా ప్రభుత్వంపై విమోచన యాత్ర పేరిట యుద్ధం ప్రకటించి నేడు జిల్లా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం చేపట్టారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే సీనియర్ భాజపా నేత, బిహార్ ఉప ముఖ్యమంత్రి సుషీల్ కుమార్ మోడీ జి.ఎస్.టి. సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, సాగునీటి ప్రాజెక్టుల పనులను పరిశీలించి తెరాస సర్కార్ పై ప్రశంశలు కురిపించారు. రాష్ట్రంలో ఇంటింటికీ నీళ్ళు ఇవ్వాలని చేస్తున్న ప్రయత్నంతో కేసీఆర్ అపరభగీరధుడు అయ్యారని ప్రశంసించారు. గజ్వేల్ లోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, ఎడ్యుకేషనల్ హబ్ పనులను, అలాగే పేద గర్భిణిస్త్రీలకు ప్రభుత్వం అమలుచేస్తున్న అమ్మ ఒడి, కేసీఆర్ కిట్స్ వంటివాటి గురించి తెలుసుకొని ప్రజాసంక్షేమం కోసం కేసీఆర్ అద్భుతమైన పధకాలు రూపొందించి వాటిని అంతే సమర్ధంగా అమలు చేస్తున్నారని మెచ్చుకొన్నారు. హైదరాబాద్ లో పోలీస్ వ్యవస్థ పనిచేస్తున్న తీరుతెన్నులను పరిశీలించి తెరాస సర్కార్ పై ప్రశంశల వర్షం కురిపించారు. అన్ని విధాల వెనుకబడిన తమ బీహార్ రాష్ట్రానికి తెలంగాణా ప్రభుత్వం అమలుచేస్తున్న ఈ పదకాలన్నీ చాలా చక్కగా నప్పుతాయని కనుక వాటిని బిహార్ లో కూడా అమలుచేయడానికి కృషి చేస్తామని అన్నారు.

కేంద్రమంత్రులు, ఇరుగుపొరుగు రాష్ట్ర ప్రభుత్వాలు, ఇప్పుడు సీనియర్ భాజపా నేత సుషీల్ కుమార్ మోడీ సైతం తెరాస సర్కార్ అమలుచేస్తున్న పధకాలను, అభివృద్ధి పనులను ఇంతగా ప్రశంశిస్తుంటే, రాష్ట్ర భాజపా నేతలు వాటిని విమర్శిస్తుండటం విశేషం. దాని వలన వారే అనేకసార్లు ఇబ్బందికరమైన ప్రశ్నలను ఎదుర్కోవలసి వస్తోంది కూడా. కనుక తెరాసపట్ల తమ పార్టీ అధిష్టానం వైఖరి ఏమిటనే విషయం రాష్ట్ర భాజపా నేతలు తెలుసుకొన్నాకనే ముందుకు సాగితే మంచిదేమో?    


Related Post