అదే ఒక ప్రత్యక్ష సాక్ష్యం కదా?

September 11, 2017


img

తెరాస సర్కార్ ఏర్పాటు చేస్తున్న రైతు సమన్వయ సమితులు రైతుల సంక్షేమం కోసమే తప్ప వాటి నుంచి ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు ఆశించడంలేదని తెరాస నేతలు ఎంతగా వాదిస్తున్నప్పటికీ, మండల, జిల్లా స్థాయి సమితులలో సభ్యత్వం కోసం తెరాస కార్యకర్తలు పోటీలు పడుతుండటం గమనిస్తే వాటి వలన తప్పకుండా రాజకీయ ప్రయోజనం ఉంటుందని భోదపడుతుంది.  ఈపోటీయే అందుకు ఒక ప్రత్యక్ష సాక్ష్యంగా కనిపిస్తోంది. 

వాటి ఏర్పాటును వ్యతిరేకిస్తూ న్యాయపోరాటాలు చేస్తామనే ప్రతిపక్షాల హెచ్చరికల నేపధ్యంలో వాటికి చట్టబద్దత కల్పించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. తద్వారా రైతు సమన్వయ సమితికి కార్పోరేషన్ హోదా కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు పొక్కడంతో తెరాస కార్యకర్తలు మండల, జిల్లా స్థాయిలో కమిటీలలో సభ్యత్వం కోసం పోటీ పడుతున్నారు. ఆ కారణంగా సెప్టెంబర్ 9లోగా ఏర్పాటు కావలసిన మండలస్థాయి కమిటీలు నేటికీ పూర్తి కాలేదని తెలుస్తోంది. 

రాష్ట్రంలో మొత్తం 577 మండల స్థాయి సమితులను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో దానిలో 14 మంది సభ్యులు చొప్పున మొత్తం 8,078 మంది సభ్యులు ఉంటారు. ఈ వ్యవస్థకు చట్టబద్దత కల్పించి, కార్పోరేషన్ హోదా ఇచ్చినట్లయితే అవన్నీ పదవులవుతాయి. పైగా కొన్ని అధికారాలు, హక్కులు, సౌకర్యాలు కూడా వారికి లభిస్తాయి. కనుకనే ఇంత పోటీ నెలకొన్నట్లు భావించవచ్చు. 

జరుగుతున్న ఈ పరిణామాలన్నీ రైతు సమన్వయ సమితులు తెరాసకు అనుబంద కమిటీలుగా మారనున్నాయనే ప్రతిపక్షాల వాదనలకు బలం చేకూరుస్తున్నట్లున్నాయి. ఒకవేళ అవి ఊహిస్తున్నట్లుగా తెరాస సభ్యులే వాటిలో  నియమితులైనట్లయితే కోర్టులో ప్రతిపక్షాల పని ఇంకా సులువు అవుతుందని వేరే చెప్పనక్కరలేదు.


Related Post