ఆ పధకాలకు మినహాయింపు ఏమయిందో?

September 09, 2017


img

ఈరోజు హైదరాబాద్ లో జరిగిన జి.ఎస్.టి.కౌన్సిల్ సమావేశం ముగిసిన తరువాత కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ దాని వివరాలు మీడియాకు వివరించారు. గత రెండు నెలలోనే సుమారు 75 శాతం మంది జి.ఎస్.టి.లో రిజిస్టర్ అయ్యారు. మిగిలినవారు కూడా త్వరలోనే చేరుతారని ఆశిస్తున్నాము. జి.ఎస్.టి. అమలులో కొన్ని సమస్యలున్నట్లు గుర్తించాము. వాటిని పరిష్కరించడానికి ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాము. ఇక రాష్ట్ర ప్రభుత్వలకు జిఎస్టిలో చెల్లించవలసిన వాటా, కొన్ని ఉత్పత్తులు, సేవలపై తగ్గింపుకోరుతూ వినతులు వచ్చాయి. వాటన్నటిపై కూడా ఈరోజు, రేపు జరుగబోయే సమావేశాలలో చర్చిస్తాము. ఈరోజు సమావేశంలో మొత్తం 30 ఉత్పత్తులపై చర్చించాము. చిన్న పెట్రోల్, డీజిల్ కార్లపై జి.ఎస్.టి.ని 5 శాతం తగ్గించాలని నిర్ణయించాము. పెద్ద కార్లు, పెద్ద వాహనాలపై జి.ఎస్.టి.ని యధాతదంగా ఉంచాలని నిర్ణయించాము. కొన్నిరకాల హస్తకళావస్తువులపై జి.ఎస్.టి. తగ్గించాలనే అభ్యర్ధనలు వచ్చాయి. అందుకు అంగీకరించాము. ఖాదీ దుస్తులు, ఉత్పత్తులను జి.ఎస్.టి. నుంచి మినహాయిస్తాము. రిటర్న్ దాఖలుకు అక్టోబర్ 10వరకు గడువు పొడిగించాము. కానీ రూ.100 కోట్లకు పైన లావాదేవీలు చేసేవారికి మాత్రం అక్టోబర్ 3వరకే గడువుంటుంది,” అని చెప్పారు. 

ఈసారి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ, కాకతీయ, సాగునీటి ప్రాజెక్టులు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం వంటి ప్రజోపయోగమైన ప్రభుత్వ పధకాలను జి.ఎస్.టి. నుంచి మినహాయించమని కోరుతామని ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. అరుణ్ జైట్లీ మాటలను బట్టి చూస్తే ఈరోజు సమావేశంలో ఆ విషయంపై చర్చించలేదని అర్ధమవుతోంది. కనీసం రేపటి సమావేశంలో దీనిపై చర్చించగలిగితే ఎప్పటికైనా దీనికి ఒక పరిష్కారం లభిస్తుంది. తెలంగాణాతో సహా దేశంలో అన్ని రాష్ట్రాలకు కూడా ప్రభుత్వ పధకాలపై ఈ జి.ఎస్.టి.భారం తగ్గుతుంది. 


Related Post