త్వరలో కాంగ్రెస్ టీవి.. కాంగ్రెస్ పేపర్!

September 09, 2017


img

అవును. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ స్వంత న్యూస్ ఛానల్ స్వంత న్యూస్ పేపర్ రాబోతోంది. ఈ విషయం తెలంగాణా పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి స్వయంగా ఈరోజు మీడియాకు తెలియజేశారు. నిన్న గాంధీ భవన్ లో జరిగిన ఆఫీస్ బేరర్స్ సమావేశంలో పాల్గొన్న నేతలు అందరూ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాను వినియోగించుకోవడంలో మిగిలిన అన్ని పార్టీల కంటే బాగా వెనుకబడిపోయిందనే అభిప్రాయపడ్డారు. కనుక ఇకపై కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో కూడా ప్రవేశించే సూచనలున్నాయి. 

రెండు తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్, భాజపాలకు తప్ప తెరాస, తెదేపా, వైకాపా, వామపక్షాలకు అనుకూలంగా ఉండే మీడియా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో మీడియా దానిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆ కారణంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటాలకు తగిన గుర్తింపు లేకుండా పోతోంది. పైగా అధికార పార్టీ నేతలు, తమ రాజకీయ ప్రత్యర్ధులు చేస్తున్న తీవ్ర విమర్శల కారణంగా నానాటికీ కాంగ్రెస్ పార్టీ ప్రజలలో పలుచన అయిపోతోంది. కనుక కాంగ్రెస్ పార్టీ స్వంతంగా మీడియాను ఏర్పాటు చేసుకోవాలనుకోవడం మంచి నిర్ణయమే. నిజానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ నిర్ణయం తీసుకొని ఉండాల్సింది. ఇప్పటికైనా మేలుకోవడం మంచిదే కానీ మళ్ళీ దానిలో కూడా కాంగ్రెస్ నేతలు తమ కవరేజ్ శాతాల గురించి కీచులాడుకోకుండా ఉండాలి. అలాగే ఇదివరకు మహారాష్ట్రాలో కాంగ్రెస్ స్వంత పత్రికలోనే సోనియా గాంధీ, పార్టీ నేతల మీద విమర్శలు రాసుకొని నవ్వులపాలయినట్లు కాకుండా జాగ్రత్తపడటం కూడా చాలా అవసరమే.  


Related Post