అందుకే వారికి క్యాబినెట్ లో చోటు దొరకలేదా?

September 09, 2017


img

దక్షిణాదిన పాగా వేయడానికి తెలంగాణా రాష్ట్రమే అనువైనదని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పారు. కనుక కేంద్రమంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తెలంగాణా నేతలకు ప్రాధాన్యం ఉంటుందని భావించడం సహజమే. కేంద్రంలో తెలంగాణాకు ఏకైక ప్రతినిధిగా ఉన్న దత్తన్నను కూడా తప్పించేశారు కానీ ఆయన స్థానంలో రాష్ట్ర భాజపా నేతలెవరికీ చోటు కల్పించలేదు. రాష్ట్ర భాజపా నేతలను పక్కన పెట్టి, తెరాసను మంత్రివర్గంలో చేరవసిందిగా ఆహ్వానించడం మరీ విచిత్రమైన విషయమే. ఈ సంగతి తెరాస ఎంపి జితేందర్ రెడ్డి స్వయంగా దృవీకరించారు కూడా.

రాష్ట్రంలో భాజపా బలహీనంగా ఉందనే అభిప్రాయంతోనే భాజపా అధిష్టానం ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. దాని ఆఫర్ ను తెరాస తిరస్కరించడం వేరే సంగతి. కానీ ఈ పరిణామం రాష్ట్రంలో భాజపా నేతలకు కూడా బొత్తిగా జీర్ణించుకోవడం కష్టమే. వారు ‘తెరాస ఒక నీటి బుడగ వంటిది అది ఎప్పుడైనా పేలిపోవడం ఖాయం’ అని దాని గురించి చాలా తేలికగా మాట్లాడుతుంటే, వారి అధిష్టానం మాత్రం బలమైన తెరాస సహాయసహకారాలు ఉంటే తప్ప రాష్ట్రంలో తమ పార్టీ మనుగడ ఉండదని భావిస్తుండటం వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతోంది. వారి అధిష్టానానికే వారి శక్తి సామర్ధ్యాలపై నమ్మకం లేనప్పుడు తెరాసను మజ్లీస్ పార్టీతో ముడిపెట్టి విమర్శిస్తే చాలు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేస్తామని పగటికలలుకంటూ కాలక్షేపం చేయడం వారికే ప్రమాదం అని గ్రహిస్తే మంచిది.


Related Post