అప్పుడు మిరప...ఇప్పుడు పెసర రైతులు

September 08, 2017


img

కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు దళారుల బారి నుండి రైతులను కాపాడేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా దళారుల దోపిడీ ఆగడం లేదు. కొన్ని నెలల క్రితం మిరపరైతులను నిలువునా దోచుకొన్న దళారులు, వ్యాపారులు ఇప్పుడు పెసర రైతులను దోచుకొంటున్నారు. 

ఈ ఖరీఫ్ సీజనులో తెలంగాణాలో 2.20 లక్షల ఎకరాలలో పెసరపంట సాగుచేశారు. కనుక ఈ ఏడు దాదాపు లక్ష టన్నులకు పైగా పెసలు మార్కెట్లకు వస్తాయని ప్రభుత్వ అంచనా. ఇప్పటికే సుమారు 5,500 టన్నులు అమ్మకాలు అయిపోయాయి. రానున్న కొన్ని వారాలలో పెసలు మార్కెట్లను ముంచెత్తబోతున్నాయి. ఇదే రైతుల పాలిట శాపంగా మారింది.

కేంద్రప్రభుత్వం క్వింటాలుకు రూ.5,570 మద్దతు ధర ప్రకటించింది. ఆ ధర అక్టోబర్ నెల నుంచి అమలులోకి వస్తుంది కనుక దళారులు, వ్యాపారులు కుమ్మక్కయ్యి కేవలం రూ.1,000 లేదా ఇంకా తక్కువకు ధర కోట్ చేస్తున్నారు. బయట మార్కెట్లో  ప్రస్తుతం పెసరపప్పు ధర కేజీ కనీసం రూ.75-85 వరకు ఉంది. అంటే క్వింటాలు (100 కేజీలు) రూ.7,500-8,500 వరకు ఉందని స్పష్టం అవుతోంది. కానీ రైతులకు క్వింటాలుకు రూ.1,000 లేదా ఇంకా తక్కువ ధర (కేజీకి రూ.8-10) చెల్లిస్తున్నారంటే వారు రైతులను ఏ స్థాయిలో దోచుకొంటున్నారో అర్ధం చేసుకోవచ్చు. 

ఈ దళారుల బెడదను అరికట్టి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు కేంద్రప్రభుత్వం ఎలక్ట్రానిక్‌ జాతీయ వ్యవసాయ మార్కెట్‌ (ఇనాం) అనే పధకాన్ని ప్రవేశపెట్టింది. అది తెలంగాణా రాష్ట్రంలో కూడా ఇప్పుడు అమలవుతోంది. కానీ ఆన్-లైన్ మార్కెట్ ధరలను సూచించే దానిలో కూడా వ్యాపారులు తమ చేతివాటన్ని ప్రదర్శిస్తూ ధరలను తగ్గించి చూపుతున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ వారిని అదుపు చేయడానికి క్వింటాలుకు రూ.1,000 కంటే తక్కువ ధర కోట్ చేయడానికి వీలుకాకుండా సాఫ్ట్ వేర్ లో మార్పు చేసినా ఫలితం కనబడటం లేదు. వ్యాపారులు ఒకటి రెండు క్వింటాళ్ళకు గిట్టుబాటు ధర చెల్లించి మిగిలిన పంటను రూ.1,000 లేదా ఇంకా తక్కువ మాత్రమే చెల్లిస్తున్నారు. 

మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మార్కెట్ లో క్వింటాలుకు రూ. 2,712 వరకు ధర పలికింది. ఇప్పటివరకు రాష్ట్రంలో అత్యధిక ధర ఇదే. తిరుమలగిరిలో క్వింటాలు రూ.2,014 ధర పలుకుతోంది. అంటే కేజీ పెసలు రూ.20కి కొంటున్నారన్న మాట! పంట దిగుబడి బాగున్నప్పటికీ గిట్టుబాటు ధర లభించక పోవడంతో పెసర రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇదివరకు దళారులు, వ్యాపారుల చేతిలో మిర్చి రైతులు దోపిడీకి గురయ్యారు. ఇప్పుడు పెసర రైతులు దోచుకోబడుతున్నారు. వారిని ఎవరు ఆదుకొంటారో...ఏమో? 


Related Post