తెరాసకు కొత్త తలనొప్పులు?

September 08, 2017


img

వేములవాడ తెరాస ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కారణంగా తెరాస సర్కార్ కు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. జర్మనీ పౌరసత్వం కలిగిన ఆయన ఉద్దేశ్యపూర్వకంగానే ఆ విషయాన్ని దాచిపెట్టి భారతీయ పౌరసత్వం పొందారని కనుక ఆగస్ట్ 3వ తేదీ నుంచి ఆయన పౌరసత్వం రద్దు చేస్తున్నట్లు కేంద్రప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్ట్ 3 నుంచి ఆయనకు భారతీయ పౌరులకు ఉండే హక్కులు, సౌకర్యాలు అన్నిటినీ తొలగిస్తున్నట్లు ఆ ఉత్తర్వులలో స్పష్టంగా పేర్కొంది. 

ఇంతకాలం ఆయనపై న్యాయపోరాటం చేస్తున్న భాజపా నేత ఆది శ్రీనివాస్ దీనిపై స్పందిస్తూ కేంద్రం జారీ చేసిన ఈ తాజా ఉత్తర్వుల దృష్ట్యా  రమేష్ తక్షణం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 

చెన్నమనేని రమేష్ ఉద్దేశ్యపూర్వకంగానే 2014 ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు ద్రువపత్రాలు సమర్పించి పోటీ చేసి గెలిచారని, తద్వారా ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని కూడా మోసం చేసారని శ్రీనివాస్ ఆరోపించారు. కేంద్రప్రభుత్వం ఇంత స్పష్టంగా ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ వాటిపై ఆయన మళ్ళీ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తానని చెప్పడాన్ని శ్రీనివాస్ తప్పు పట్టారు. ఆయన తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని లేకుంటే తెరాస ప్రభుత్వమే ఆయనను పదవిలో నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

చెన్నమనేని రమేష్ భారతీయ పౌరసత్వం రద్దు కావడంతోనే ఆయన పదవి కూడా కోల్పోయినట్లే అవుతుందని వేరే చెప్పనవసరం లేదు. ఆయన మళ్ళీ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయదలచుకొన్నప్పటికీ, ప్రస్తుతం ఆయన పౌరసత్వం రద్దు అయ్యింది కనుక ఆయన ఒక విదేశీయుడిగానే పరిగణించబడతారు. విదేశీయులకు చట్టసభలలో కొనసాగే హక్కు ఉండదు కనుక ఆయన తన పదవికి రాజీనామా చేసి న్యాయపోరాటం చేసుకొంటే తెరాస సర్కార్ కు ఎటువంటి తలనొప్పులు ఉండవు. ఆలాకాక ఆయన ఇంకా తన పదవికి రాజీనామా చేయకుండా దానిలో కొనసాగినా లేదా సుప్రీంకోర్టు తుది తీర్పు చెప్పేవరకు తెరాస సర్కార్ వేచిచూడదలచినా మున్ముందు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక రాష్ట్ర ప్రభుత్వం దీనిపై తక్షణం స్పందించవలసి ఉంటుంది.


Related Post