నేరెళ్ళ సమస్య మళ్ళీ మొదటికి?

September 08, 2017


img

నేరెళ్ళ ఘటన తెరాస సర్కార్ కు ఎంత అప్రదిష్ట కలిగించిందో అందరూ చూశారు. కనుక దానికి సంబంధించి దేనినైనా కాస్త సున్నితంగా వ్యవహరించవలసి ఉంటుంది. కానీ మళ్ళీ ఆ వ్యవహారంపై నీమ్స్ ఆసుపత్రి వైద్యులు భాధితులతో మొరటుగా వ్యవహరించడంతో మానుతున్న ఆ గాయాన్ని మళ్ళీ కెలుకొన్నట్లయింది. 

హైదరాబాద్ నీమ్స్ ఆసుపత్రిలో రెండు రోజుల క్రితమే చేరిన నేరెళ్ళ బాధితులు బాల్ రాజ్, గోపాల్, మహేష్, ఈశ్వర్, హరీష్ అనే ఐదుగురిని గురువారం రాత్రి బలవంతంగా డిశ్చార్జ్ చేసారు. వారికి తీవ్ర ఆరోగ్య సమస్యలున్నాయని వైద్యులే దృవీకరించారు కానీ ‘పై నుంచి ఒత్తిళ్ళు వస్తున్నాయని’ చెపుతూ బలవంతంగా డిశ్చార్జ్ చేసారు. భాదితులు ఎంతగా బ్రతిమాలినప్పటికీ వారిని ఆసుపత్రిలో ఉంచుకొని వైద్యం చేయడానికి ఆసుపత్రి యాజమాన్యం అంగీకరించలేదు. అప్పుడు బాధితులు ఎమర్జెన్సీ వార్డు ముందు ధర్నాకు దిగారు. ఈ విషయం తెలుసుకొన్న కాంగ్రెస్ నేత వి హనుమంతరావు, ప్రజా సంఘాల నేతలు అంత రాత్రిపూట హడావుడిగా ఆసుపత్రికి చేరుకొని వారు కూడా బాధితులతో కలిసి ధర్నా చేశారు. అప్పటికే అక్కడ మీడియా చేరుకొని ఉండటంతో ఈ విషయం అంతటా పాకిపోయింది.

అంత రాత్రిపూట ఆసుపత్రి వద్ద వారు చేస్తున్న హడావుడితో కంగారుపడిన నీమ్స్ ఆసుపత్రి యాజమాన్యం దిగివచ్చింది. తాము ఎవరినీ బలవంతంగా బయటకు గెంటివేయలేదని, ఎమర్జెన్సీ వార్డులో చేరిన వారందరికీ తగిన చికిత్స చేసిన తరువాత వారికి మరికొన్ని వైద్య పరీక్షలు నిర్వహించవలసి ఉంటుందని తెలిపామని సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. తరువాత బాధితులను కేర్ ఆసుపత్రికి తరలించి దానిలో చేర్చారు. కానీ అప్పటికే జరుగవలసిన నష్టం జరిగిపోయింది. నేరెళ్ళ బాధితులను అర్దరాత్రి పూట ఆసుపత్రిని నుంచి బలవంతంగా బయటకు గెంటేసారనే వార్తలు మీడియాలో కార్చిచ్చులాగ వ్యాపించాయి.

దళితుల పట్ల తెరాస సర్కార్ కు చులకన భావం ఉందని, వారిని చిన్నచూపు చూస్తోందని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు వాదిస్తుంటే తెరాస నేతలు వారి విమర్శలను త్రిప్పి కొట్టడానికి విశ్వప్రయత్నాలు చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఈ సంఘటన జరుగడం తెరాస సర్కార్ కు చాలా ఇబ్బందికరమైన విషయమే. 

ఇదివరకు ఈ వ్యవహారంలో పోలీసుల అత్యుత్సాహం వలన ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తే ఈసారి నీమ్స్ వైద్యుల వలన చెడ్డపేరు వస్తోంది. బాధితులకు నీమ్స్ ఆసుపత్రిలో అవసరమైన వైద్య చికిత్సలు చేసి ఉండి ఉంటే ఎవరూ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపగలిగి ఉండేవారు కారు. కానీ వారిని ఆసుపత్రి నుంచి అర్ధరాత్రిపూట డిశ్చార్జ్ చేయమని ‘పై నుంచి ఒత్తిళ్ళు’ చేయడం నిజమైతే అంతకంటే పెద్ద పొరపాటు మరొకటి ఉండబోదు. ఒకవేళ ఇది కాంగ్రెస్ నేతలు పధకం ప్రకారమే ఆడిన నాటకం అయితే ఇంతకంటే నీచ రాజకీయాలు ఉండబోవు. 

ఏమైనప్పటికీ ఇన్ని చేదు అనుభవాలు, అప్రదిష్ట మూటగట్టుకొన్న తరువాతైనా ప్రభుత్వం నేరెళ్ళ భాదితుల విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించి ఉండి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. నిన్న జరిగిన ఈ ఘటనతో నేరెళ్ళ వ్యవహారాన్ని మళ్ళీ కెలుకొన్నట్లయిందని చెప్పక తప్పదు. కనుక ఇకనైనా జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది.


Related Post