2014 ఎన్నికల సమయంలో రాష్ట్రంలో దళితులకు మూడెకరాల చొప్పున వ్యవసాయ భూమి ఇస్తామని తెరాస అధినేత హామీ ఇచ్చారు. కానీ దానిని అమలుచేయడంలో అనేక సమస్యలు ఎదురవుతున్నందున మిగిలిన హామీలలాగ దాని గురించి ఖచ్చితంగా మాట్లాడలేకపోతున్నారు. అయితే ఎన్ని సమస్యలు ఎదురవుతున్నప్పటికీ యధాశక్తిన ఆ హామీని అమలుచేస్తున్నట్లు మానకొండూర్ ఉదంతం స్పష్టం చేస్తోంది. స్థానికులు చెప్పినదానిని బట్టి భూపంపిణీలో అవినీతి జరుగుతున్నట్లు అర్ధం అవుతోంది. అంటే హామీ అమలు చేస్తున్నప్పటికీ దానిలో నెలకొన్న కొన్ని లోపాలవలనే సమస్యలు ఉత్పన్నం అవుతున్నట్లు స్పష్టం అవుతోంది.
మానకొండూర్ లో ఇద్దరు దళితులు ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తెరాస సర్కార్ పై ముఖ్యంగా.. స్థానిక తెరాస ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు, తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు.
వాటిపై స్పందించిన రసమయి బాలకిషన్ బయటపెట్టిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ సమస్యకు ఇతర కారణాలు కూడా ఉన్నాయని తెలియజెప్పుతున్నాయి.
ఆయన మీడియాతో మాట్లాడుతూ, “స్థానిక కాంగ్రెస్ నేత ఆరేపల్లి మోహన్ ఈ భూపంపిణీ కార్యక్రమానికి ప్రధాన అవరోధంగా ఉన్నారు. రాష్ట్రంలో మిగిలిన అన్ని నియోజక వర్గాల కంటే ఎక్కువగా నా మానకొండూర్ నియోజకవర్గంలోనే ఎక్కువ భూపంపిణీ చేశాను. దాని వలన తనకు రాజకీయంగా నష్టం కలుగుతుందనే భయంతోనే ఆయన దీనిపై నీచ రాజకీయాలు చేస్తూ నాపై బురద జల్లాలని ప్రయత్నిస్తున్నారు. నిజానికి నేను వీలైనంత ఎక్కువ భూములు దళితులకు పంచాలని ఎన్ని ప్రయత్నాలు చేశానో అందరికీ తెలుసు. నేను భూములు పంచాలని ప్రయత్నిస్తుంటే, ఆరేపల్లి కబ్జాలు చేయాలని ప్రయత్నిస్తుంటారు. ఇదే మా ఇద్దరికీ మద్య ఉన్న తేడా.
ఈ భూపంపిణీ కోసం అవసరమైన భూమిని కొనుగోలు చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. అయినా అనేక సమస్యలను అధిగమించి ప్రభుత్వ సహకారంతో నేను భూములు కొని దళితులకు పంచిపెడుతుంటే దానినీ రాజకీయం చేయాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నించడం బాధాకరం. ఈ భూపంపిణీ కార్యక్రమంలో అవినీతి జరిగినట్లు చేస్తున్న ఆరోపణలను ఆయన వాటిని రుజువు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను,” అని సవాలు విసిరారు.
భూపంపిణీ కోసం బడ్జెట్ లో కేటాయించిన నిధులను నియోజకవర్గానికి మంజూరు చేయించుకోవడం, భూములను గుర్తించి కొనుగోలు చేయడం, మళ్ళీ వాటిని అర్హులైనవారికి పంచడం అంతా సంక్లిష్టమైన ప్రక్రియే. దానిని ఇటువంటి రాజకీయాలు, దురదృష్టకర సంఘటనలు ఇంకా సంక్లిష్టం చేస్తాయని చెప్పకతప్పదు. నేతలందరూ పార్టీలకు అతీతంగా ఆలోచించి సహకరించుకొన్నప్పుడే ఏ కార్యక్రమం అయినా విజయవంతం అవుతుంది. అర్హులైన పేదప్రజలకు వాటి ఫలాలు లభిస్తాయి. కానీ అది సాధ్యం కాదని స్పష్టం అవుతోంది.