తెరాస సర్కార్ దళిత వ్యతిరేక ప్రభుత్వమని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం కరీంనగర్ లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “గతంలో ఏ ప్రభుత్వమూ చేయనంతగా మేము దళితుల సంక్షేమానికి గట్టిగా కృషి చేస్తున్నాము. దళిత రైతులకు మూడెకరాల వ్యవసాయ భూమి ఇవ్వాలనే ఆలోచన చేసిందే మేము. దాని కోసం మా ప్రభుత్వం రూ.479 కోట్లు ఖర్చు చేసింది. దానితో 11,729 ఎకరాలను కొనుగోలు చేసి దళితులకు పంచిపెట్టింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో దాని కోసం రూ. 800 కోట్లు కేటాయించాము. మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కాంగ్రెస్, భాజపా, వామపక్షాల ప్రభుత్వాలు ఏనాడైనా దళితులకు ఈవిధంగా భూములు ఇచ్చాయా? ఏనాడైన వారి సంక్షేమం కోసం ఇంత ఖర్చు పెట్టాయా? మీరు దళితుల కోసం ఏమీ చేయకపోయినా చేస్తున్న మమ్మల్ని విమర్శించడం సిగ్గు చేటు,” అని ప్రతిపక్షాలను తీవ్రంగా విమర్శించారు.
ఈటెల రాజేందర్ ఆవేదన సహేతుకమైనదే. దళితుల కోసం తెరాస సర్కార్ చాలా చేస్తున్న మాట కూడా వాస్తవమే. అయితే దాని హయంలోనే ఖమ్మం మార్కెట్ యార్డు విద్వంసం కేసులో రైతులను జైల్లో పెట్టబడ్డారు..గౌరవంగా బ్రతికేవారి చేతులకు సంకెళ్ళు పడ్డాయి. తెరాస సర్కార్ పాలనలోనే నేరెళ్ళలో దళితులపై దాడులు జరిగాయి. తెరాస సర్కార్ చేపట్టిన భూపంపిణీ కార్యక్రమంలో జరుగుతున్న అవకతవకల కారణంగానే ఇద్దరు దళిత రైతులు ఆత్మహత్యాయత్నం చేసుకొని ప్రస్తుతం చావుబ్రతుకుల మద్య ఊగిసలాడుతున్నారు.
వీటినే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మానకొండూర్ లో ఇద్దరు దళితరైతులు ఎందుకు ఆత్మహత్యాయత్నం చేసుకొన్నారు? అనే ఉత్తం కుమార్ రెడ్డి ప్రశ్నకు ఈటెల చెప్పిన ఈ మాటలు జవాబు కాదు. ప్రతిపక్షాలు తమను విమర్శిస్తున్నాయని ఆవేదన చెందడం కంటే చిరకాలంగా వివక్షకు గురవుతున్న దళితులు నేటికీ ఇంకా వివక్షకు గురవుతున్నారని ఆవేదన చెందాలి.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్ష నేతలను పదేపదే సన్నాసులు, దద్దమ్మలని అంటునప్పుడు, గత ప్రభుత్వాలన్నీ అవినీతివని వాదిస్తున్నప్పుడు వారికి ఎంత నొప్పి కలుగుతుందో ఏనాడూ పట్టించుకోలేదు. కానీ వారు తమ ప్రభుత్వాన్ని దళిత వ్యతిరేక ప్రభుత్వం అని అంటే తెరాస నేతలకు ఆగ్రహం వస్తోంది. రాష్ట్రంలో దళితులకు జరుగుతున్న అన్యాయాలను వారు ఎత్తిచూపిస్తుంటే తప్పుగా కనిపిస్తోంది. ఇది సమంజసమేనా? ఆలోచించుకోవాలి.
ఈవిధంగా ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేస్తూ వాటి ఒరు మూయించే ప్రయత్నం చేయడంకంటే, అవి బయటపెడుతున్న ఈ లోపాలను సవరించుకొంటూ ముందుకు సాగినట్లయితే ప్రభుత్వానికి చాలా హుందాగా ఉంటుంది. అప్పుడు దళితులతో సహా అన్ని వర్గాల ప్రజలు తెరాసకు జై కొడతారు కదా?