తమిళనాడు ప్రభుత్వం మనుగడ తెలంగాణాకు చెందిన గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు చేతిలో ఉందిప్పుడు. శశికళ, ఆమె మేనల్లుడు దినకరన్ లకు చెందిన 21 మంది అన్నాడిఎంకె ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడంతో మైనార్టీలో పడిన పళనిస్వామి ప్రభుత్వాన్ని ఆయనే కాపాడుతున్నారని చెప్పవచ్చు.
తక్షణమే బలపరీక్ష నిర్వహించాలనే ప్రతిపక్షాల డిమాండ్లు పట్టించుకోకుండా పళని, పన్నీరు వర్గాలు మళ్ళీ బలం కూడగట్టుకట్టుకొనేందుకు చాలా ఉదారంగా తగినంత సమయం ఇస్తున్నారు. అయినప్పటికీ వారిరువురూ దినకరన్ క్యాంప్ లో ఉన్న ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవడంలో విఫలం అయినట్లే ఉన్నారు.
వారిరువురు కలిసి మంగళవారం చెన్నైలోని రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి దినకరన్ కు క్యాంప్ లోని 21 మంది ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. శాసనసభలో అన్నాడిఎంకెకి మొత్తం 134 మంది సభ్యులు ఉండగా వారిలో 109 మాత్రమే సమావేశానికి హాజరయ్యారు.
ఒకవేళ గవర్నర్ ప్రతిపక్షాలు ఒత్తిడికి తలొగ్గి లేదా హైకోర్టు ఆదేశించినా బలపరీక్షకు ఆదేశించినట్లయితే పళనిస్వామి ప్రభుత్వం అధికారంలో కొనసాగడానికి కనీసం 117మంది సభ్యుల మద్దతు అత్యవసరం. కనుక ఆలోగానే మిగిలిన 8 మందిని కూడగట్టుకోవలసి ఉంటుంది. ఇంతవరకు తిరుగుబాటు ఎమ్మెల్యేలను బుజ్జగించి దారిలోకి తెచ్చుకోవడానికి పళని, పన్నీరు చేసిన విశ్వప్రయత్నాలు ఏవీ ఫలించకపోవడంతో వారందరిపై అనర్హత వేటు వేయబోతున్నట్లు సంకేతాలు పంపించారు. అయితే వారెవరూ పార్టీ ఫిరాయించలేదు కనుక అనర్హత వేటు వేయడం సాధ్యం కాకపోవచ్చు. వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినా ప్రయోజనం ఉండదు కనుక పళని, పన్నీరు ఇప్పుడు మరో కొత్త ఆలోచన ఏదైనా చేయవలసి ఉంటుంది. అన్నాడిఎంకెలో ఈ కుమ్ములాటలు, ముఠాలు, వాటి సమీకరణాలు, బలాబలాలు ఎలా ఉన్నప్పటికీ, ప్రజాస్వామ్యాన్ని..దాని విలువలను కాపాడవలసిన గవర్నర్ ఈవిధంగా ఒక మైనార్టీ ప్రభుత్వాన్ని ఒక కాపు కాస్తుంన్నందుకు సంతోషించాలా లేక బాధపడాలా?