ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, “ఈరోజుల్లో బాగా చదువుకొని సంపాదించుకొంటున్నవారు ఎక్కువ మంది పిల్లల్ని కంటే వారిని పెంచి పోషించడం భారంగా మారుతుందనే భయంతో ఒకరిద్దరి కంటే ఎక్కువ పిల్లల్ని కనడానికి ఇష్టపడటం లేదు. కానీ ఈవిధంగా అందరూ పిల్లల్ని కనకపోతే ఏదో ఒకరోజు మనం రోబోల మీద ఆధారపడవలసిన పరిస్థితి తప్పకుండా వస్తుంది. కనుక ఎక్కువ మంది పిల్లల్ని కంటే మంచిది. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ పాటించాలని నేనే గట్టిగా ప్రచారం చేశాను కానీ మారిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఎక్కువ మంది పిల్లల్ని కనమని నేనే ప్రోత్సహిస్తున్నాను,” అని అన్నారు.
చంద్రబాబు చాలా దూరదృష్టితో ఆలోచించి మాట్లాడుతుంటారనే పేరుంది కనుక ఎప్పుడో భవిష్యత్ సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈవిధంగా మాట్లాడారని అర్ధం అవుతూనే ఉంది. అయితే ఈరోజుల్లో ఒక్క పిల్ల లేదా పిల్లాడిని కని పెంచడమే చాలా భారంగా ఉన్నప్పుడు ఇద్దరికంటే ఎక్కువమంది పిల్లల్ని కంటే వారిని ప్రభుత్వం పోషించదు కదా?
దేశంలో నానాటికీ నిరుద్యోగం, ధరలు, ఖర్చులు పెరిగిపోతూనే ఉన్నాయి తప్ప తగ్గుముఖం పట్టడం లేదు. ఎల్.కె.జి.కే వేలు లక్షల్లో డొనేషన్లు, ఫీజులు చెల్లించవలసి వస్తోంది. అవి కూడా పిల్లలతో బాటు నానాటికీ పెరుగుతుంటాయే తప్ప తగ్గవు. కనుక ఇద్దరు పిల్లలున్న కుటుంబాలలో భార్యాభర్తలిద్దరూ తప్పనిసరిగా పనిచేస్తే తప్ప ప్రశాంతంగా జీవించలేని పరిస్థితులు నెలకొని ఉన్నాయి.
ఇక చాలా మంది భారతీయులు గత రెండు, మూడు దశాబ్దాలుగా కుటుంబ నియంత్రణ పాటిస్తూ ఒకరిద్దరు పిల్లలకే పరిమితం అయినప్పటికీ దేశ జనాభా 125 కోట్లు దాటి పోయింది. ఒకవేళ చంద్రబాబు చెప్పినట్లు మళ్ళీ అందరూ ఎక్కువ మంది పిల్లల్ని కనడం మొదలుపెడితే దేశ జనాబా మళ్ళీ పెరిగిపోతుంది. జనాభా పెరిగిపోతే ఏమవుతుందో అందరికీ తెలుసు. కనుక చంద్రబాబు నాయుడు ఏ ఉద్దేశ్యంతో ఈ సలహా ఇచ్చినప్పటికీ ప్రస్తుత పరిస్థితులలో అది ఆచరణీయం కాదనే చెప్పాలి.
చంద్రబాబు సలహాపై మొట్టమొదటగా వైకాపా ఎమ్మెల్యే రోజా స్పందించారు. “అందరినీ ఎక్కువ మంది పిల్లలు కనమని సలహా ఇస్తున్న అయన లోకేష్ ఒక్కడితోనే ఎందుకు సరిపెట్టుకొన్నారు? లోకేష్ కూడా దేవాన్ష్ ఒక్కడితోనే ఎందుకు సరిపెట్టుకొన్నారు?” అని ప్రశ్నించారు.
రోజా ప్రశ్నకు బాబు, లోకేష్ ఇంకా సమాధానం చెప్పలేదు కానీ కాంగ్రెస్ నేత ఎస్.పద్మశ్రీ చెప్పారు. “రాజకీయాలలో రాణించలేకపోతున్న తన కొడుకు నారా లోకేష్ ను చూసి బాధపడుతున్న చంద్రబాబు నాయుడు ప్రయోజకుడైన మరొక కొడుకో కూతురో ఉండి ఉంటే బాగుండునని భావిస్తున్నందునే ఈవిధంగా ప్రజలకు సలహా ఇస్తున్నారేమో?” అని అన్నారు.