తెరాస సర్కార్ రైతు సమన్వయ సమితిలను ఏర్పాటు చేసే బాధ్యతను జిల్లా మంత్రులకు అప్పగిస్తే ప్రతిపక్షాలు తప్పకుండా అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చుననే అనుమానాలు నిజమని నిరూపితమవుతున్నాయి. వాటిలో ఎవరు సభ్యులుగా ఉండాలో నిర్ణయించే అధికారం మంత్రులకు కట్టబెడుతూ వ్యవసాయ శాఖ ఆగస్ట్ 27న జీవో నెంబర్: 39 జారీ చేసింది.
ఊహించినట్లుగానే దానిపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. ప్రభుత్వం దానిని ఉపసంహరించుకోకపోతే దానిపై న్యాయపోరాటం చేయడానికి వెనుకాడమని తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇతర పార్టీల నేతలు కూడా తెరాస సర్కార్ ఆలోచనలను తప్పు పట్టారు. తెరాస కార్యకర్తలతో కూడిన రైతు సమన్వయ సమితిలను ఏర్పాటు చేసే ప్రయత్నాలను ఎదిరిస్తామని హెచ్చరించారు.
అయినా ప్రభుత్వం ముందుకు సాగి మంత్రుల కనుసన్నలలో రైతు సమన్వయ సమితిల ఏర్పాటు చేస్తుండటంతో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దేవుని ఎర్రవల్లి గ్రామానికి చెందిన చింపుల సత్యనారాయణరెడ్డి హైకోర్టు లో నిన్న ఒక పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం, బ్యాంకుల నుంచి వ్యవసాయం కోసం రైతులకు అందవలసిన సహాయసహకారాలను నియంత్రించబోయే ఈ రైతు సమన్వయ సమితిలలో సభ్యులను నామినేట్ చేసే అధికారం జిల్లా మంత్రులకు కట్టబెట్టడం ద్వారా రైతులకు అన్యాయం జరుగుతుందని, కనుక వ్యవసాయశాఖ జారీ చేసిన జీవో నెంబర్: 39ను రద్దు చేయాలని పిటిషనర్ కోరారు. దీనిలో ప్రతివాదులుగా వ్యవసాయ శాఖ కార్యదర్శి, కమిషనర్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శిని చేర్చారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు సెప్టెంబర్ 12న దానిని విచారిస్తామని తెలిపింది.
రైతు సమన్వయ సమితిల సహకారంతోనే రాష్ట్రంలో భూరికార్డులను సరిచేసి వాటికి ఆమోదం తెలుపడం, ఈ భూరికార్డులు, సమితిల సిఫార్సుల ఆధారంగానే వచ్చే ఏడాది నుంచి రైతులకు ఎకరానికి రెండు పంటలకు కలిపి ఎకరానికి రూ.8,000 చొప్పున ప్రభుత్వం చెల్లించబోతోంది. తెరాస మంత్రులు, ప్రజా ప్రతినిధుల కనుసన్నలలో ఏర్పాటయ్యే ఆ సమితిలు సహజంగానే తెరాస అనుబంధ సమితిలుగా మారే అవకాశం ఉంటుంది కనుక అవి రాష్ట్రంలో రైతులను నయాన్నో, భయన్నో తెరాస వైపు ఆకర్షించడానికి ప్రయత్నించడం సహజమే. కనుక తెరాసకు అనుకూలంగా ఉన్నవారికి లాభం, వ్యతిరేకించేవారికి కష్టాలు, నష్టాలు తప్పకపోవచ్చు. తెరాస సర్కార్ రైతుల ప్రయోజనాల కోసం కాకుండా తన స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసమే మంత్రుల కనుసన్నలలో ఈ రైతు సమన్వయ సమితిలను ఏర్పాటు చేసుకొంటోందనే ప్రతిపక్షాల వాదన. కనుక వాటి ఏర్పాటును వ్యతిరేకిస్తూ న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించాయి.
హైకోర్టు లో దాఖలైన ఈ పిటిషన్ వాటి తరపునే వేసి ఉండవచ్చనేది బహిరంగ రహస్యమే. కనుక ఇప్పటికే కోర్టులలో అనేక పిటిషన్లు వేసి ప్రతిపక్షాలు రాష్ట్రాభివృద్ధికి అడ్డు పడుతున్నాయని వాదిస్తున్న తెరాస నేతలు, మళ్ళీ మరోసారి అవే విమర్శలను వల్లె వేయవచ్చు. ఒకవేళ హైకోర్టు పిటిషనర్ వాదనలతో ఏకీభవించి జీవో నెంబర్: 39 పై స్టే విధిస్తే తెరాస సర్కార్ తీరని అప్రదిష్ట కలుగుతుంది. దాని ప్రయత్నాలకు బ్రేకులు పడవచ్చు.