కేటిఆర్ కృషి ఫలిస్తే...

September 05, 2017


img

రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి కేటిఆర్ కృషి ఫలిస్తే రాష్ట్రంలో చిన్న పరిశ్రమలకు మళ్ళీ పూర్వవైభవం రావడం తధ్యం. తెలంగాణాలో మొత్తం 69,120 చిన్న పరిశ్రమలున్నాయి. వాటి ద్వారా కొన్ని లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. పన్నుల రూపేణా ప్రభుత్వానికి కూడా బాగానే ఆదాయం సమకూరుతోంది.

తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో పరిశ్రమను ఏర్పాటుచేసి ఉత్పత్తి ప్రారంభించగలిగే వెసులుబాటు ఉన్నందున ఒకప్పుడు మెకానికల్, ఎలక్ట్రికల్ లేదా ఏదైనా సాంకేతిక రంగంలో కొద్దిపాటి అనుభవమున్న యువత ఉద్యోగాల కోసం కంపెనీల చుట్టూ తిరగకుండా బ్యాంక్ ల నుంచి రుణాలు తీసుకొని చిన్నచిన్న వర్క్స్ షాపులు, పరిశ్రమలు నెలకొల్పేవారు. 

అయితే కాంగ్రెస్ హయంలో విద్యుత్ కొరత, పరిశ్రమలు, మౌలికవసతుల కల్పన శాఖలలో అవినీతి, మార్కెట్ లో పోటీ పెరగడం వంటి అనేక కారణాల చేత మెల్లమెల్లగా అవి సమస్యలలో కూరుకుపోయేవి. అదే సమయంలో రుణాల చెల్లింపు కోసం బ్యాంకుల నుంచి ఒత్తిడి పెరిగిపోతే అవి మూతపడుతుండేవి. చిన్న పరిశ్రమల సమస్యల గురించి ప్రభుత్వానికి, బ్యాంకులకు పూర్తి అవగాహన ఉన్నప్పటికీ వాటికీ చేయూతనందించి నిలద్రొక్కుకొనేందుకు సహాయపడకుండా నియమనిబంధనలు వల్లె వేయడంతో ఒకప్పుడు చిన్న పరిశ్రమలతో కళకళలాడిన పారిశ్రామికవాడలు బోసిపోయి కనిపిస్తుంటాయి. 

తెరాస సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్దప్రాతిపదికన అనేక చర్యలు తీసుకొని విద్యుత్ కొరతను నివారించగలిగింది. కేటిఆర్ పరిశ్రమల శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చిన్న పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిరంతరంగా కృషి చేస్తున్నారు. వాటికి అవసరమైన సహాయ సహకారాలు అందించి మళ్ళీ నిలద్రొక్కుకొనేందుకు ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా వాటి అభివృద్ధికి పరిశ్రమల శాఖలో ఉన్న అవరోధాలను గుర్తించి తొలగిస్తూ అనేక సంస్కరణలు చేశారు. తెరాస సర్కార్ చేపట్టిన ఈ అన్ని చర్యలతో రాష్ట్రంలో మళ్ళీ చిన్న పరిశ్రమలు జీవకళను సంతరించుకొంటున్నాయి. అయితే నేటికీ వాటిపట్ల బ్యాంకుల తీరు వాటి ఎదుగుదలకు అవరోధంగానే ఉంది. 

మంత్రి కేటిఆర్ సోమవారం ముంబైలో ఆర్.బి.ఐ.గవర్నర్ ఉర్జీత్ పాటిల్ ను కలిసినప్పుడు చిన్న పరిశ్రమల పరిస్థితుల గురించి వివరించి, వాటి విషయంలో బ్యాంకుల అనుచిత వైఖరిని ఆయన దృష్టికి తీసుకువెళ్ళారు. రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలకు విరుద్దంగా బ్యాంకులు వ్యవహరిస్తున్న తీరును వివరించారు. చిన్న పరిశ్రమలు నిలద్రొక్కుకొని ఎదగడానికి తమ ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుంటే, బ్యాంకులు మాత్రం వాటికి సహకరించడంలేదని పిర్యాదు చేశారు. చిన్న పరిశ్రమలు నిలద్రొక్కుకొంటే అందరికీ కూడా మేలు కలుగుతుందని కనుక బ్యాంకులను వాటికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించేవిధంగా చూడాలని కేటిఆర్ ఆర్.బి.ఐ.గవర్నర్ ను కోరారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. కనుక మంత్రి కేటిఆర్ చేస్తున్న ఈ ప్రయత్నాలన్నీ ఫలిస్తే రాష్ట్రంలో అన్ని పారిశ్రామికవాడలు మళ్ళీ కళకళలాడటం ఖాయం. 


Related Post