భాజపా పేరుకే జాతీయ పార్టీ : బల్కా సుమన్

September 05, 2017


img

కేంద్రమంత్రి వర్గంలో తెలంగాణా రాష్ట్రం నుంచి ఏకైక ప్రతినిధిగా ఉన్న బండారు దత్తత్రేయను పదవిలో నుంచి తప్పించడం, మళ్ళీ ఆయన స్థానంలో వేరెవరికీ చోటు కల్పించకపోవడంపై రాష్ట్ర భాజపా నేతలు ఇంతవరకు స్పందించలేదు. బహుశః వారు లోలోన బాధపడుతుండవచ్చు. అయితే అత్త కొట్టిందనే బాధ కంటే అది చూసి తోడికోడలు పకపకా నవ్విందనే ఎక్కువ బాధపడినట్లుగా ఉంది రాష్ట్ర భాజపా నేతల ప్రస్తుత పరిస్థితి. తెరాస నేతలు దీనిపై చేస్తున్న వ్యాఖ్యలు, తమపై వారు కనబరుస్తున్న సానుభూతిని జీర్ణించుకోవడం ఇంకా కష్టంగా ఉంది. 

బిసి అయిన దత్తన్నను పదవిలో తప్పించి భాజపా పెద్ద పొరపాటు చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దత్తన్నను తప్పించినప్పటికీ రాష్ట్ర భాజపా నేతలలో ఎవరికీ అవకాశం కల్పించకపోవడం చూస్తే భాజపా అధిష్టానం రాష్ట్ర నేతలెవరినీ పరిగణనలోకి తీసుకొన్నట్లు లేదని, అందుకే వారు తమ అధిష్టానం దృష్టిలో పడేందుకు  తెలంగాణా విమోచన యాత్రల పేరుతో హడావుడి చేస్తున్నారని తెరాస ఎంపి బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. 

మతం పేరుతో ప్రజల మద్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది పొందడానికి రాష్ట్ర భాజపా నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ సాధ్యం కాదని, వారు తెలంగాణాలో ఎన్నటికీ అధికారంలోకి రాలేరని అన్నారు. ఈ సందర్భంగా ఆయన భాజపాపై కూడా తీవ్ర విమర్శలు గుప్పించడం విశేషం. 

భాజపా పేరుకే జాతీయపార్టీ గానీ దానికి దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలలో అసలు పట్టులేదని కనుక దానిని ఒక పెద్ద పార్టీగా మాత్రమే చెప్పుకోవచ్చని అన్నారు. భాజపా రెండు తెలుగు రాష్ట్రాల పట్ల చాలా చులకనగా వ్యవహరిస్తోందని అందుకే వెంకయ్య నాయుడు, దత్తన్న స్థానాలలో ఎవరికీ అవకాశం కల్పించలేదని అన్నారు.  

తెలంగాణా రాష్ట్రం పట్ల మోడీ సర్కార్ ఎప్పుడూ సవతి ప్రేమనే చూపిస్తోందని సుమన్ అభిప్రాయపడ్డారు. హైకోర్టు విభజన చేయకుండా మూడున్నరేళ్ళు గడిపేసిందని ఇంకా ఎప్పుడు తెలంగాణాకు హైకోర్టు ఏర్పాటు చేస్తుందో ఎవరికీ తెలియదన్నారు. ఐటిఐఆర్ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయకపోవడాన్ని సుమన్ తప్పు పట్టారు. తెలంగాణా రాష్ట్రానికి ఒక్క జాతీయ సాగునీటి ప్రాజెక్టును కూడా మంజూరు చేయలేదన్నారు. ఏపికి కూడా కేంద్రం అన్యాయం చేస్తోందన్నారు. 

తెలంగాణాలో తమ బలం ఎంతో తెలుసుకోకుండా రాష్ట్ర భాజపా నేతలు విమోచన యాత్రలు చేస్తూ తమ ప్రభుత్వంపై విమర్శలు ఆరోపణలు చేస్తున్నారని సుమన్ ఎద్దేవా చేశారు. వారి హడావుడి చూసి ప్రజలు కూడా నవ్వుకొంటున్నారన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకొంటునప్పుడు మళ్ళీ విమోచన దినోత్సవం జరుపుకోవడం ఎందుకని సుమన్ ప్రశ్నించారు.

సాధారణంగా తెరాస ముఖ్య నేతలు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు చేసే ఇటువంటి వ్యాఖ్యలు లేదా విమర్శలను తరువాత ఏదో ఒక సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పలుకుతుండటం గమనిస్తే ఆయన సూచనల మేరకే వారు ఈవిధమైన వ్యాఖ్యలు చేస్తున్నట్లు భావించవలసి ఉంటుంది. కనుక భాజపా గురించి బాల్క సుమన్ వ్యక్తం చేసిన ఈ అభిప్రాయలు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ వే నని భావించవలసి ఉంటుంది. 


Related Post