దేశంలో మైనార్టీలు, దళితులు తదితర వర్గాల ప్రజలను మనుషులుగా కాక ఓట్లు వేసే యంత్రాలుగానే రాజకీయ పార్టీలు భావిస్తుంటాయనేది బహిరంగ రహస్యమే. కనుక ఆ వర్గాలపై అవసరమైనప్పుడు ‘అదనపు ప్రేమ’ను ఒలకబోస్తుంటాయి. దళితులు, మైనార్టీలకు చీమ కుట్టినా మన నేతలు విలవిలలాడిపోతుంటారు. కానీ అంతమాత్రన్న మన రాజకీయ నేతలకు వారిపై నిజంగా ప్రేమ ఉందనుకోవడం అత్యాసే అవుతుంది. రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకొన్నప్పుడు రాహుల్ గాంధీతో సహా వివిద పార్టీల నేతలు ఎంత హడావుడి చేశారో ఆ తరువాత ఆ సంగతి పూర్తిగా మరిచిపోయారో అందరికీ తెలుసు.
మొదట రోహిత్ వేముల, తరువాత నేరెళ్ళ బాధితులు, ఇప్పుడు మానకొండూర్ దళితులు. వారి ద్వారా ఎంతో కొంత రాజకీయ మైలేజి సంపాదించుకోవాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తుంటే, ఆ కారణంగా తాము రాజకీయంగా నష్టపోతామనే భయంతో అధికార పార్టీ స్పందిస్తుంటుంది.
నేరెళ్ళ ఘటనలో పోలీసుల చేతిలో చిత్రహింసలకు గురైన దళితులకు నేటికైనా న్యాయం జరిగిందా? దోషులందరిపై కేసులు నమోదు చేశారా? అందరూ శిక్షించబడ్డారా? అనే ప్రశ్నలకు సమాదానాలు అందరికీ తెలుసు.
ఇప్పుడు ప్రతిపక్షాలు మానకొండూర్ లో ఆత్మహత్యాయత్నం చేసుకొన్న ఇద్దరు దళితుల గురించి గట్టిగా మాట్లాడుతున్నాయి. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని ఎన్నికలలో వాగ్ధానం చేసి అధికారంలోకి వచ్చాక తెరాస దానిని నిలబెట్టుకోకపోలేదు కానీ పారిశ్రామికాభివృద్ధి పేరిట కార్పోరేట్ సంస్థలకు వందల ఎకరాలను ఉదారంగా పంచిపెడుతోందని కాంగ్రెస్, తెదేపా, వామపక్షాల నేతలు విమర్శించారు. మానకొండూర్ లో ఇద్దరు దళితులు అసలు ఎందుకు ఆత్మహత్యాయత్నం చేసుకొన్నారో ప్రభుత్వం ప్రకటించాలని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. నేరెళ్ళ బాధితులకు న్యాయం జరిగేవరకు వారి తరపున ప్రభుత్వంతో తాము పోరాడుతామని అన్నారు.
నిజమే! ప్రతిపక్షాల ఒత్తిడి కారణంగానే తెరాస సర్కార్ నేరెళ్ళ ఘటనలో ఒక పోలీస్ అధికారిని సస్పెండ్ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు బాధితులకు మంచి చికిత్స అందిస్తోంది. అయితే నేటికీ నేరెళ్ళ బాధితులకు పూర్తి న్యాయం జరుగలేదనే చెప్పక తప్పదు. అయినా ప్రతిపక్షాలు ఇప్పుడు వారిని పట్టించుకోకుండా మానకొండూర్ దళితుల గురించి మాట్లాడుతున్నాయి. ఇప్పటి వరకు వారు వ్యవహరిస్తున్న తీరును గమనిస్తే రేపు ఇటువంటిదే మరో ఘటన జరిగితే అందరూ దానికి ‘షిఫ్ట్’ అయిపోతారని అర్ధం అవుతోంది. ఏ కేసులలో కూడా బాధితులకు పూర్తి న్యాయం జరిగిన దాఖలాలు లేవు. దాని కోసం అధికార, ప్రతిపక్షాలు గట్టిగా ప్రయత్నించినట్లు కనబడవు. చివరకు ఓటు బ్యాంక్ రాజకీయాలే కనబడుతుంటాయి.