తెరాస నిర్ణయం మంచిదే కానీ...

September 05, 2017


img

ఆదివారం జరిగిన కేంద్రమంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు కొన్నిరోజుల ముందుగా ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా తెరాస లోక్ సభ సభ్యుడు జితేందర్ రెడ్డి ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒక సందేశం పంపించారుట. తెరాసను తమ ప్రభుత్వంలో చేరవలసిందిగా ఆహ్వానించడం దాని సారాంశం. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు నిరాకరించినట్లు జితేందర్ రెడ్డి స్పష్టం చేశారు.  

“మేము కేంద్రమంత్రివర్గంలో కానీ ఎన్డీయే కూటమిలో గానీ చేరాలనుకోవడం లేదు. 2019 ఎన్నికల తరువాత అప్పటి పరిస్థితులను బట్టి ఎన్డీయే కూటమిలో చేరాలా వద్దా అని నిర్ణయించుకొంటాము. ఈ విషయంలో 2019 ఎన్నికల వరకు మా వైఖరిలో ఎటువంటి మార్పు ఉండబోదని మా అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇదే మా అంతిమ నిర్ణయం,” అని జితేందర్ రెడ్డి చెప్పారు.

వచ్చే ఎన్నికలలో భాజపా గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని రాష్ట్ర భాజపా నేతలు ఎన్ని గొప్పలు చెప్పుకొంటున్నప్పటికీ, తెరాస సహకారం, మద్దతు లేనిదే రాష్ట్రంలో భాజపా నిలద్రొక్కుకోలేదని అందుకే తెరాసను ఎన్డీయే కూటమిలోకి రప్పించడానికి మోడీ సర్కార్ తెర వెనుక ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్లు భావించవచ్చు. అయితే రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలను నిర్దేశించగల స్థాయిలో ఉన్న ముస్లింల పట్ల వ్యతిరేకత ప్రదర్శిస్తున్న భాజపాతో చేతులు కలిపినట్లయితే మొదటికే మోసం వస్తుందనే భయంతోనే కేసీఆర్ దానికి దూరంగా ఉంటున్నారని భావించవచ్చు. అందుకే రాష్ట్ర భాజపా నేతలు తెలంగాణా విమోచన దినోత్సవం పేరిట తెరాసను మజ్లీస్ పార్టీతో ముడిపెట్టి విమర్శలు గుప్పిస్తున్నారని చెప్పవచ్చు. 

ఒకవేళ ఎన్డీయే కూటమిలో, కేంద్రప్రభుత్వంలో తెరాస చేరినట్లయితే అది ఇప్పటిలాగా ధైర్యంగా, స్వేచ్చగా మాట్లాడలేదు. తెలంగాణా ప్రయోజనాల కోసం కేంద్రంతో గట్టిగా నిలదీయలేదు. పైగా రాష్ట్రంలో భాజపాకు అధికారం పంచి ఇవ్వవలసి రావచ్చు. కనుక 2019 ఎన్నికల వరకు ఎన్డీయేకు దూరంగా ఉండలనే నిర్ణయం సరైనదేనని చెప్పవచ్చు. 

అయితే దక్షిణాది రాష్ట్రాలలో పాగా వేయడానికి తెలంగాణాయే అత్యంత అనువైన రాష్ట్రమని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా ప్రకటించిన సంగతి మరిచిపోరాదు. కనుక తెరాసను నయాన్నో భయన్నో లొంగదీసుకొనేందుకు భాజపా తప్పకుండా ప్రయత్నించవచ్చు. అందుకు అరుణాచల్ ప్రదేశ్, తమిళనాడు, బిహార్ రాష్ట్రాలు ప్రత్యక్ష సాక్ష్యాలుగా ఉన్నాయి. 


Related Post