జవాబు తెలిసిన ప్రశ్నలవి

September 04, 2017


img

సెప్టెంబర్ నెల వస్తే రాష్ట్ర భాజపా నేతలకు తెలంగాణా విమోచన దినోత్సవం అంటూ హడావుడి చేస్తుంటారు. ఈ నెల 1 నుంచి 7 వరకు రాష్ట్రంలో విమోచన యాత్రలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు ప్రతీ ఏట తెరాస సర్కార్ ను అడిగే ప్రశ్నే మళ్ళీ పదేపదే అడుగుతున్నారు. తెలంగాణా విమోచన దినోత్సవాన్ని తెరాస సర్కార్ అధికారికంగా నిర్వహించడానికి ఎందుకు భయపడుతోంది? అనేది వారి ప్రశ్న.

ఎటువంటి ప్రశ్నకైనా టక్కున ధీటుగా సమాధానం చెప్పే తెరాస నేతలు ఈ ఒక్క ప్రశ్నకు మాత్రం ఎన్నడూ నేరుగా జవాబు చెప్పే సాహాసం చేయలేదు. కనుక దానికి జవాబును రాష్ట్ర భాజపా నేతలే చెప్పుకొంటారు. ముస్లిం ఓట్ల కోసం, మజ్లీస్ పార్టీతో స్నేహం కోసం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని చెపుతుంటారు. 

వారి వాదనలను తెరాస ఎంపి బాల్క సుమన్ ఖండించారు కానీ వారి ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పకుండా “రాష్ట్రంలో తన ఉనికిని చాటుకోవడానికే భాజపా విమోచన దినోత్సవం పేరుతో హడావుడి చేస్తోంది. ఆ పార్టీ నేతలు చీటికి మాటికి మజ్లీస్ పార్టీని, ముస్లిం ఓటు బ్యాంక్ గురించి మాట్లాడుతూ చవుకబారు రాజకీయాలు చేస్తున్నారు. ప్రజల మద్య మతం పేరిట చిచ్చు పెట్టి రాష్ట్రంలో నిలద్రొక్కుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కానీ కెసిఆర్ పాలనలో వారి ఆటలు సాగవు,” అని అన్నారు. 

రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ, “ఈ మూడేళ్ళలో కేసీఆర్ సర్కార్ కబుర్లు చెప్పడం తప్ప రాష్ట్రాభివృద్ధి కోసం చేసిందేమీ లేదు. అదే..ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో సాధించారు. ఈ మూడేళ్ళలో అనేక సంస్కరణలు చేశారు. అనేక అభివృద్ధి పనులు చేశారు. ప్రపంచ దేశాలలో భారత్ పేరుప్రతిష్టలు ఇనుమడించేలా చేశారు. ఇక్కడ తెరాస సర్కార్ మాత్రం ఎప్పుడూ మాటలకే పరిమితం అవుతుంది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే తమ బ్రతుకులు బాగుపడతాయని ప్రజలు అనుకొంటే, అందుకు భిన్నంగా కేసీఆర్ పాలన సాగుతోంది,” అని విమర్శించారు. 

తెరాస, భాజపాల మధ్య జరుగుతున్న ఈ వాగ్వాదాలలో అందరికీ సమాధానం తెలిసిన రెండు ప్రశ్నలున్నాయి. 1. భాజపా అడుగుతున్న ఆ ప్రశ్నకు తెరాస ఎందుకు సమాధానం చెప్పడం లేదు? 2. తెలంగాణా సర్కార్ పని తీరు అద్భుతంగా ఉందని కేంద్రం మెచ్చుకొంటుంటే రాష్ట్ర భాజపా నేతలు అది అసలు పనిచేయడం లేదని ఎందుకు విమర్శిస్తున్నారు? 


Related Post